
విశ్వకర్మకు ఘన నివాళి
కడప సెవెన్‌రోడ్స్: శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డీఆర్వో మాట్లాడుతూ కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘విశ్వకర్మ జయంతి’’ గా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖఅధికారులు, పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, పాల్గొన్నారు.