
ముంపు.. ముప్పు
● ముంచుకొస్తున్న సోమశిల వెనుక జలాలు
● ఆగిన వాహన రాకపోకలు
● 28 గ్రామాల ప్రజలకు అవస్థలు
అట్లూరు : వేగంగా వస్తున్న ముంపు జలాలతో.. ముప్పు పొంచి ఉంది. సోమశిల జలాశయంలో రోజురోజుకు నీరు పెరుగుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో ఉంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేములూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెన పైకి సోమశిల వెనుక(ముంపు) జలాలు ముంచుకొస్తున్నాయి. లోలెవల్ వంతెన నీట మునగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 28 గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 69 టీఎంసీలు దాటితే సగిలేరు నది వంతెనపైకి చేరుతాయి. ప్రస్తుతం సోమశిలలో 74.5 టీఎంసీలు ఉన్నాయి. దీంతో సోమవారం నాటికి వంతెనపైకి మూడు అడుగుల మేర నీరు చేరింది.
చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి
మండల నడిబొడ్డున సగిలేరు ఉంది. ఈ నదికి తూర్పు భాగాన కమలకూరు, మణ్యంవారిపల్లి, మాడపూరు, కామసముద్రం, వేమలూరు, ముత్తుకూరు గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 28 గ్రామాలు ఉన్నాయి. అలాగే పడమర భాగాన 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల కార్యాలయాలతోపాటు పోలీస్‌స్టేన్ సహా సగిలేరు నదికి పడమర ఉన్న మండల కేంద్రమైన అట్లూరులో ఉన్నా యి. సాధారణంగా ఆ గ్రామాల వారు మండల కేంద్రమైన అట్లూరుకు ఆరు కిలో మీటర్ల దూరం ప్రయాణించే వెళ్లే వారు. కానీ వంతెన నీట మునగడంతో.. బద్వేలు మీదుగా వెళ్లాల్సి రావడంతో 40 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
రైతులకు తప్పని తిప్పలు
సగిలేరు నదికి ఇరువైపులా కొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వంతెనపై నీరు చేరవడంతో.. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నడములలోతు వరకు నీరు వచ్చింది. ప్రమాదం అని తెలిసినా కొంత మంది అదే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికై నా సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

ముంపు.. ముప్పు