
ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం
● అన్నదాత సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
● 9న రైతు పోరును జయప్రదం చేయండి
● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : రాష్ట్రంలో ఏ పంటకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 9న జరిగే రైతు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన మిర్చి, శనగ, ఉల్లి, చీనీ, అరటి, మినుముల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక, ప్రభుత్వం నుంచి సహాయం అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో రైతులు ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందన్నారు.
రైతులపై చిన్నచూపు
హార్టికల్చర్ మాజీ చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియా కొరత ఉందని చెబితే.. భోజనానికి పోతే క్యూలో నిలబడమా, రైతులు కూడా ఎరువుల కోసం క్యూలో నిలబడ్డారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హేళన చేసి మాట్లాడటం తగదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరిలో యూరియా వేయడం వల్ల రోగాలు వస్తాయని, రైతులు వరి పంట వేయవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారన్నారు. రైతులకు కావలసిన యూరియా అందిస్తామని ఎక్కడా చెప్పడం లేదన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రైతులు ఏ రోజు యూరియా కావాలంటూ రోడ్డున పడ్డ దుస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి రైతులంటే అలుసైపోయిందని వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, వెంకటరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బొనం సురేష్ పాల్గొన్నారు.