
నొప్పి మాయం.. సర్జరీ దూరం
● ఫిజియోథెరపీ దివ్య ఔషధం
● దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం
● రిమ్స్‌లో ప్రత్యేక వైద్య సేవలు
● నేడు ఫిజియోథెరపీ దినోత్సవం
కడప అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో అనేక మంది యువత, పెద్దలు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలకు మందులు లేకుండా ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందించి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఫిజియోథెరపీ ఎందుకు అవసరం?
ఆధునిక జీవనంలో ఫిజియోథెరపీ అవసరం రోజురోజుకు పెరుగుతోంది. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ప్రమాదాల వల్ల కలిగే గాయాలు, పక్షవాతం, మానసిక ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఫిజియోథెరపీ అద్భుతమైన చికిత్సగా నిలుస్తోంది. వ్యాయామాల ద్వారా, చేతితో చేసే చికిత్సల ద్వారా (మాన్యువల్ థెరఫీ)తోపాటు, ఇతర పద్ధతుల ద్వారా శారీరక కదలికలను మెరుగుపరచి, నొప్పిని తగ్గించి, జీవిత నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, బలహీనత వంటి వాటిని నియంత్రించడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో కూడా ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది.
పీడియాట్రిక్ ఫిజియోథెరపీ..
పిల్లల భవిష్యత్తు కోసం..
పిల్లల ఆరోగ్యానికి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఎంతో అవసరం. పుట్టినప్పటి నుంచి వచ్చే కండరాల బలహీనత, శరీర భాగాల కదలికలో సమస్యలు, మెదడు పక్షవాతం (సెలెబ్రల్ పల్సీ) వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపిస్టులు వ్యాయామాల ద్వారా పిల్లల శారీరక సామర్థ్యాన్ని పెంచుతారు. దీనివల్ల వారు నడవడం, కూర్చోవడం, చేతులు ఉపయోగించడం వంటివి సులభంగా నేర్చుకుంటారు. పిల్లలు సాధారణ జీవితం గడపడానికి, స్కూల్‌కి వెళ్లడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఈ చికిత్స దోహదపడుతుంది.
ఫిజియోథెరపీలో మహిళల పాత్ర
గర్భధారణ, ప్రసవం, రుతుక్రమం వంటి సందర్భాల్లో మహిళలు ఎదుర్కొనే శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ చికిత్సను ఉపయోగించుకోవడం లేదు. ఫిజియోథెరపీ ద్వారా ఈ సమస్యలను అధిగమించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
కడప రిమ్స్‌లో ఫిజియోథెరపీకి ప్రత్యేక వైద్యం
కడప రిమ్స్‌లో ఫీజియోథెరపీ విభాగంలో ప్రతి రోజు మేల్, ఫిమేల్ ఓపీలో సుమారు 70 నుంచి 80 మంది పేషెంట్స్ ఫీజియో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రజలకు సంపూర్ణ వైద్య విధానంలో ఫీజియోథెరపీ చేస్తున్నారు. ఇక్కడ ఫీజియోథెరపీ సంబంధంగా పిడియాట్రిక్స్, జినియాట్రిక్స్ ఎలక్ట్రో థెరపీ, ఎక్సర్సిస్ థెరపీ పరికరాలతో విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లతో పక్షవాతం, కీళ్ల నొప్పులు, పోస్ట్ ఆప్, ఆర్థో సర్జరీస్‌లకు, ఎముకల, నరాల సంబంధం అగు మరి ఎన్నో వ్యాధులకు రిమ్స్‌లో ఫీజియో విభాగం లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్థో, న్యూరో, కార్డియో, పిడియాట్రిక్స్ సర్జరీస్ భా గాలకు, తదితర అవసరమైన విభాగాలకు ఫీజియోథెరపీ చికిత్స చేయడం జరుగుతుంది. నూతన లేజర్, యుఆర్‌థెరెపీ ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు వయోవృద్ధుల వరకు కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. కడప, ఇతర ప్రాంతాల నుంచి చికిత్స మేరకు ఇక్కడికి రావడం జరుగుతుంది.
ఫిజియోథెరపీని ప్రోత్సహించాలి
వైద్యులు, ఫిజియోథెరపీ నిపుణులు ఫిజియోథెరపీని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించడానికి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలని కూడా అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రజలు కూడా మందులపై ఆధారపడకుండా ఫిజియోథెరపీ చికిత్సను స్వీకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మా విభాగంలో ముగ్గురు ఫీజియోథెరపిస్టులు 30 మంది సిబ్బంది ద్వారా ఇక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ ప్రోత్సాహంతో నూతన పరికరాలు, ప్రక్రియలతో ఫీజియోథెరెపీ విభాగం అభివృద్ధి చెందుతోంది.
– డాక్టర్ సంపత్ కుమార్, హెచ్‌ఓడీ, ఫిజియోథెరపీ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్), కడప

నొప్పి మాయం.. సర్జరీ దూరం

నొప్పి మాయం.. సర్జరీ దూరం