
నాణ్యమైన వైద్యం పేదలకు దూరం
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. ఆదివారం కడపలో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని, అయితే మన రాష్ట్రలో మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారన్నారు. వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు మొదటి ఏడాది 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని, రెండో ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ కూడా అందులో ఉందన్నారు. ఈలోపు ఎన్నికలు రావడంతో మూడు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయన్నారు.
కేంద్రం సీట్లు కేటాయించినా..
పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే, నిర్వహణ తమ వల్ల కాదంటూ కేంద్రానికి లేఖ రాసిన చరిత్ర కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు వైద్య విద్యను తక్కువ ఫీజులతోనే పూర్తి చేసే అవకాశముంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేటు పరం చేయడం వల్ల మెడికల్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకునే అవకాశముందని, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆరోగ్య సేవలు పేదలకు అందుబాటులో ఉండవన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే పరమావధిగా పెట్టుకుంటారని విమర్శించారు. విద్యారంగంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, నారాయణ, చైతన్య విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రభుత్వ విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉపయోగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ దుబారా ఖర్చు తగ్గిస్తే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించవచ్చన్నారు.
కమీషన్ల్ల కోసం పన్నాగం
ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు దోచిపెట్టి కమీషన్లు కాజేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. అపర సంజీవని ఆరోగ్యశ్రీని భీమా పద్ధతిలో అమలు చేస్తూ దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఉరి వేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, సుదర్శన్, గుంటి నాగేంద్ర, రెడ్డి ప్రసాద్, బసవరాజు, శంకరాపురం సింధు, సాయిదత్త, పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దారుణం
దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే
ప్రైవేటీకరణ రద్దు
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా