
ఉపాధ్యాయులు.. సమాజ నిర్మాతలు
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ సభాభవన్‌లో మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి ఽరాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెలీ రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారంతా జ్యోతి వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైయిందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది రాజకీయ నాయకులు, అధికారులు కాదని గురువులేనని తెలిపారు. పిల్లలకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలన్నారు. ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపైన పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ తాను 15 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చానన్నారు. ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నాన్న కూడా ఉపాధ్యాయుడేనని, ఆయన మార్గదర్శకంలో నడిచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 64 మందికి అవార్డులు అందజేశారు. వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడీ కాగిత శ్యాముల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ డీఆర్‌ఓ విశేశ్వరనాయుడు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ నిత్యానందరాజు, డిప్యూటీ ఈవోలు రాజగోపాల్‌రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్, జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటన్ సాంబశివారెడ్డి, సైన్సు మ్యూజియం క్యూరేటర్ రెహమాన్, పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
64 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం

ఉపాధ్యాయులు.. సమాజ నిర్మాతలు