
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
చాపాడు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా రైతు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగాన్ని విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించడం వల్ల ఈనెల 9న మైదుకూరులో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అత్యధికంగా మైదుకూరు నియోజకర్గంలో 92 వేల ఎకరాల్లో ప్రతి ఏటా వరితోపాటు వివిధ రకాలైన పంటలు సాగుతాయన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో యూరియా కొరత రైతులను వేధిస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి మైదుకూరు నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాల్లో యూరియా విక్రయించడం లేదన్నారు. దీంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ఎరువుల దుకాణాల్లో బస్తా రూ.400తో వ్యాపారులు గోప్యంగా విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరో వైపు ఉల్లి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఏమో క్వింటాల్ రూ.2 వేలకు కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ కనీసం రూ.800కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ క్రమంలో మైదుకూరులో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.
ఈ నెల 9న మైదుకూరులోధర్నా, నిరసన ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి