
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక
కడప సెవెన్‌రోడ్స్: భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, అందరూ మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) అడుగ జాడల్లో నడవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు. మహా ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పేరుతో నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, కడప నియోజకవర్గ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ)ను అల్లాహ్ చివరి ప్రవక్తగా పంపారని పేర్కొన్నారు. ఆయన్ను ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపారని తెలిపారు.
నగరంలో భారీ ర్యాలీ: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని కడప నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మర్కజీ మిలాద్ జులూస్ ఆధ్వర్యంలో అగాడిలోని ఇనాయత్‌ఖాన్ తాలిం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అల్మాస్‌పేట, వన్‌టౌన్, పొట్టిశ్రీరాములు సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సలావుద్దీన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు హజరత్ మహమ్మద్ అలీబొగ్దాది, హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అబ్దుల్ రెహ్మాన్ బొగ్దాది, హజరత్ అబ్దుల్ రహీం, హమీద్ హుసేన్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్‌బాబు, ఆరీఫుల్లా, నజీర్ అహ్మద్, అలీఖాన్, సుబాన్‌బాషా, షఫీవుల్లా, మహమ్మద్ అలీతోపాటు పెద్దఎత్తున ముస్లిం యువకులు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మతపెద్దలు, నగర ముస్లిం ప్రముఖులు, నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు
మహా ప్రవక్త అడుగుజాడల్లో నడవాలి
మిలాదున్నబీ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

భారతదేశం మత సామరస్యానికి ప్రతీక