
బాకీ డబ్బు అడిగినందుకు దళిత యువకుడి హత్య
దువ్వూరు : బాకీ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు దళిత యువకుడు హత్యకు గురైన సంఘటన దువ్వూరు మండలం భీమునిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. భీమునిపాడు ఎస్సీ కాలనీకి చెందిన జేష్టాది దివాకర్ (35), పక్క గ్రామం సంగటితిమ్మాయపల్లెకు చెందిన నాగ దస్తగిరి ఇరువురు స్నేహితులు. ఇద్దరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జేష్టాది దివాకర్ దగ్గర నాగదస్తగిరి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆదివారం దివాకర్ తనకు డబ్బు చాలా అవసరం ఉందని అప్పుగా ఇచ్చిన రూ.10వేలు ఇవ్వాలని నాగదస్తగిరిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో అని నాగదస్తగిరి అన్నాడు. ఈ క్రమంలో దివాకర్ అతని ఫోన్ తీసుకుని తీసుకున్న అప్పు చెల్లించి ఫోన్ తీసుకెళ్లు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న దివాకర్ ఇంటి వద్దకు నాగదస్తగిరి వెళ్లి డబ్బు ఇస్తాను రా మాట్లాడుదాం అని పిలుచుకెళ్లాడు. ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే డబ్బు ఇవ్వలేదని తన సెల్‌ఫోన్ తీసుకెళతావా అని దివాకర్ తలపై బండరాయితో నాగదస్తగిరి గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలతో దివాకర్ అక్కడే పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన దివాకర్‌ను ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో దివాకర్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు దివాకర్‌కు భార్య మహాలక్షుమ్మ, కుమారుడు సుదీప్(12) ఉన్నారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, భార్యా పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై మృతుడి తల్లి జేష్టాది మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు దువ్వూరు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు. గత నెల 26న మదిరేపల్లె గ్రామంలో బాకీ చెల్లించలేదని దళిత యువకుడు పాలగిరి చెన్నయ్యను హత్య చేసిన సంఘటన మరువక ముందే మండలంలో మరో దళిత యువకుడు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.