
షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం
అట్లూరు : అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైన సంఘటన అట్లూరు మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల, బాధితుల కథనం మేరకు రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో జవ్వాజి సావిత్రి, సుబ్బరాయుడు దంపతులు ఆదివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా అర్థరాత్రి సమయంలో ఇంటిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే విద్యుత్తు వైర్లు తొలగించి మంటలను అదుపు చేసే లోపే ఇంట్లోని వైరింగ్‌తో పాటు ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, బీరువాలోని రూ.20 వేలు నగదు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
2 కిలోల గంజాయి స్వాధీనం
ముద్దనూరు : ముద్దనూరు–కడప రహదారిలో ఓ డాబా వద్ద సోమవారం గణపత్ దావర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దస్తగిరి తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్వాలి గ్రామానికి చెందిన గణపత్ అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.