
ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిరంతర పోరాటాలు చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పెట్టుబడికి ప్రభుత్వ సాయం అందడంలేదని, విత్తనాలు రావడంలేదని, అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తుంటే యూరియా అందడంలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదన్నారు. యూరియాను టీడీపీ నాయకులు పక్కదారి పట్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. ఎరువులు వ్యాపారులకే సరఫరా చేస్తుండటంతో రైతు సేవా కేంద్రాల్లో దొరకక రైతన్నలు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు రైతులకు అందేవన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో కనీసం 10శాతం శ్రద్ధ చూపినా రాష్ట్రంలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలు బాగుపడే అవకాశం ఉంటుందన్నారు.టీడీపీ వారి ఆరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.