
పెన్నానదిలో యువకుడి గల్లంతు
జమ్మలమడుగు (మైలవరం) : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెంకటరమణ (33) అనే యువకుడు పెన్నా నదిలో గల్లంతయ్యాడు. శనివారం అతను పెన్నా నది నీటిలో దిగాడు. అయితే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకొని పోతుండగా సమాచారం మేరకు మైలవరం ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి, సిబ్బంది వెంకటరమణను పట్టుకోవడానికి నీటిలో దిగారు. ప్రవాహం ఎక్కుగా ఉండటంతో వారు కూడా అతి కష్టం మీద గట్టుకు చేరారు. మైలవరం జలాశయం అధికారులతో మాట్లాడి నీటిని ఆపివేయించి గాలించినా యువకుడి ఆచూకీ దొరకలేదు.
నేడు నెలనెలా సీమ సాహిత్యం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా 146వ సదస్సును ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి పేర్కొన్నారు. ఈ 146వ సదస్సులో ‘శుభ్రజ్యోత్స (యెద్దల గంగయ్య) జీవితం సాహిత్యం’ అనే అంశంపై నాగిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎఫ్.ఎ.సి) గంగనపల్లె వెంకటరమణ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
డాన్స్ మాస్టర్‌పై దాడి
మదనపల్లె రూరల్ : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రామ్‌లో మాస్టర్‌పై కొందరు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన గౌతమ్(35) డాన్స్ మాస్టర్‌గా ప్రోగ్రామ్‌లకు వెళుతుంటాడు. ఇందులో భాగంగా సీటీఎంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శుక్రవారం రాత్రి బృందంతో కలిసి డాన్సులు వేసేందుకు వెళ్లాడు. స్టేజిపై గౌతమ్ డాన్స్ చేస్తుండగా, అక్కడే ఉన్న ఓ యువతి డాన్స్ వేసేందుకు స్టేజీ ఎక్కింది. డాన్స్ చేసే క్రమంలో యువతిని గౌతమ్ తాకడాన్ని సహించలేని యువతి బంధువులు డాన్స్‌మాస్టర్ గౌతమ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
యువతికి పాముకాటు
రామసముద్రం : పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లిన యువతిని విష సర్పం కాటేసిన సంఘటన శనివారం రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చెంబకూరుకు చెందిన టి. బాబు కూతురు టి. అంజుమ్ (19) ఇంటికి సమీపంలోని పొలం వద్ద ఉన్న పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లింది. అక్కడ గడ్డి మధ్యన ఉన్న ఓ విష సర్పం ఆమె కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల సమీంలోని ఓ హోటల్ సమీపంలో బొలేరో పికప్ వాహనం పాత సామాన్ల లోడుతో రాయచోటి వెళుతుండగా టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలోనే కలకడ వైపు నుంచి వస్తున్న కారు ఆగి వున్న బొలేరో పికప్ వాహనాన్ని అదుపు తప్పి ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.