
రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
కమలాపురం : ఉల్లి రైతులు కుదేలయ్యారని, పంట గిట్టు బాటు ధర లేక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం కమలాపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న రైతులకు ప్రతి దశలో సాయం చేశారని, విత్తు నుంచి విక్రయం వరకు పూర్తిగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం మద్దతు ధర లేక పోవడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు , అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేని పరిస్థితితో కూటమి ప్రభుత్వం ఉందని మండి పడ్డారు. యూరియా దొరకక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న ఆర్‌బీకేలను ఏర్పాటు చేసి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ నమోదు చేసుకున్న 48 గంటల్లోనే రైతు ముంగిట చేర్చేవారన్నారు. ప్రస్తుతం ఉల్లి పంట కోత దశకు వచ్చిందని, బహిరంగ మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.800 కూడా పలకడం లేదని రైతులు మథన పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు క్వింటా రూ.1200 కొనుగోలు చేస్తామని చెప్పడమే గాని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయలేదన్నారు. ఉల్లి రైతులు దిగుబడులు తీసుకుని మార్కెట్ యార్డులకు వెళ్తే కనీసం ఆటో చార్జీలు కూడా రావడం లేదన్నారు. క్వింటా రూ.2వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు రైతులను పరామర్శించడానికి ఒంగోలుకు, మిర్చి రైతుల కోసం గుంటూరుకు, మామిడి రైతుల కోసం బంగారు పాళ్యంకు జగనన్న వెళితే ప్రభుత్వం దిగి వచ్చి మద్దతు ధరలు ప్రకటించిందని గుర్తు చేశారు. ఉల్లి రైతుల కోసం కూడా జగనన్న వస్తేనే కొనుగోలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మాజీ ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తక్షణం ఉల్లి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్ రెడ్డి