
వినూత్న ఆలోచనలతోనే ఉన్నత స్థాయి
కడప ఎడ్యుకేషన్ : క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమస్యకు పరిష్కారం చూపే వినూత్న ఆలోచనలు మిమ్మలను ఉన్నత స్థాయిలో నిలుపుతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ‘మోటివేషనల్ టాక్ ఆన్ కిరీర్‌పై అవగాహన సదస్సు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అన్నమాచార్య సేన హాల్లో శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ వి బ్రహ్మారెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. నేటితరం యువత సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తూ కెరీర్‌లో సక్సెస్ కావాలంటే మాట్లాడడం నేర్చుకోవాలన్నారు ముఖ్యంగా పుస్తకాలు చదవడం అలవాటుగా మారితే ఒక కొత్త లోకం చూసినట్లు ఉంటుందన్నారు. మంచి సినిమాలు చూడాలని, అందులోని విలువైన విషయాన్ని జీవితానికి ఉపయోగపడే వాటిని తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి శాసీ్త్రయ దృక్ఫథంతో ఆలోచించాలని, ఉద్వేగాలు, ఉద్రేకాలకు దూరంగా ఉండాలన్నారు. అతిగా ఆలోచించడం మానివేయాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా జీవించడం అలవర్చుకోవాలని తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి పద్మ మాట్లాడుతూ నైపుణ్యాలు పొందడంలో గత కాలానికి నేటికీ అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని సమయపాలన పాటిస్తూ వాటిని సాకారం చేసుకోవాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని తీసుకువచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ విశ్వవిద్యాలయ సమన్వయకర్త ఎన్ వెంకట్రామిరెడ్డి , పీఓలు డాక్టర్ లలిత, ఎం. అనిత, డాక్టర్ శ్రీ నివాసరావు, అధ్యాపకులు డాక్టర్ ఎస్. రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ టి. సురేష్ బాబు, సుధీర్, డాక్టర్ మరియదాస్, మనస్విత, వెంకటరమణ పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ బ్రహ్మారెడ్డి