
ఘనంగా తెలుగు భాషాదినోత్సవం
కడప ఎడ్యుకేషన్ : తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వ్యావహారిక భాషకు చేసిన సేవలోని సంస్కారాన్ని అందిపుచ్చుకోవడమే అసలైన తెలుగు భాషా దినోత్సవమని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం శుక్రవారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, వక్త ఆచార్య మేడిపల్లి రవికుమార్, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ప్రధానవక్తగా విచ్చేసిన ఆచార్య మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పట్టుదల గల మనిషని, సాధారణ ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించినప్పటికీ తనకు పరిచయం లేని సవర భాషను నేర్చుకున్నారన్నారు. అంతేగాక ఆ భాషకు వ్యాకరణాన్ని, నిఘంటువును రూపొందించారన్నారు. ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ నాగబు అనేది తొలి తెలుగు పదమని, అది అమరావతి శాసనం ఆధారంగా తెలిసిందన్నారు. . ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ను ఆచార్య జి.పార్వతి, జానమద్ది విజయ భాస్కర్, డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకట రమణ, ఎం.మౌనిక, సిబ్బంది కలసి ఘనంగా సత్కరించారు.