
భక్తుల పాలిట కొంగుబంగారం ఆరోగ్యమాత
కడప సెవెన్‌రోడ్స్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలో వెలిసిన ఆరోగ్యమాత భక్తుల పాలిట కొంగుబంగారంగా అలరారుతోంది. నగరంలోని ప్రముఖ క్రైస్తవ మందిరాలలో ఇదొకటి. బ్రిటీషు పాలనలో నిర్మించిన ఈ చర్చి కాలక్రమంలో పెద్ద చర్చిగా వెలిసింది. ఇటీవల ఆ ప్రాంగణంలో అధునాతనంగా మరో పెద్ద చర్చిని నిర్మించారు. అర్ద చంద్రాకారంలో రెండు అంతస్థులుగా రూపుదిద్దుకున్న ఈ చర్చిలో ఒక్కొక్క అంతస్తులో 1200 మందికి చొప్పున ఒకేసారి ప్రార్థనలు చేసుకునే వీలుంది. భక్తులు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాన్ని కడప వేలాంగిణిగా భావిస్తారు. ఏటా ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాన్ని పది రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
నేటి నుంచి ఉత్సవాలు
ఆరోగ్యమాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.00 గంటలకు పతాకావిష్కరణ, నవదిన ప్రారంభ వేడుకలు, దివ్య బలిపూజ నిర్వహించనున్నారు. కడప పీఠాఽధిపతి సగినాల పాల్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే సెప్టెంబరు 7, 8 తేదీల్లో తిరునాల మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 8వ తేది ఉదయం 8.30 గంటలకు విశాఖపట్టణం అగ్రపీఠం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ఆధ్వర్యంలో మహోత్సవ సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు చెందిన మత పెద్దలు దైవ సందేశాన్ని అందజేయనున్నారు.
నేటి నుంచి తిరుణాల