
వచ్చారు.. వెళ్లారు..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కడప కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్‌ల వ్యవహారం మరింతగా కొనసాగుతూనే వుంది. దీనికి కారణం అధికారుల ‘నామమాత్రపు విచారణ’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప కేంద్ర కారాగారంలో దశల వారీగా నిర్వహించిన తనిఖీలలో పీడియాక్ట్ రిమాండ్ ఖైదీ జాకీర్ వద్దనే 12 సెల్‌ఫోన్‌లు, ఛార్జర్ దొరికాయి. ఆయా తనిఖీలలో దొరికిన సమయాలలో విధుల్లో వున్న వారిని బలిపశువులుగా మార్చి ఏకంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్‌లను మొత్తం ఏడుగురిని సస్పెన్షన్ చేసి అధికారులు ‘మమ’ అనిపించారు. తరువాత ప్రతిరోజూ పత్రికల్లో కడప కేంద్ర కారాగారంలో అవినీతిపై కథనాలు ప్రచురితం కావడంతో.. జైళ్లశాఖ డీజీ అంజనీకుమార్ జూలై 29న కడప కేంద్ర కారాగారంలో పర్యటించారు. అంతకుముందు రాజమహేంద్రవరం డీఐజీ ఎం.ఆర్ రవికిరణ్‌ను ప్రాథమిక విచారణ అధికారిగా పంపడంతో.. ఆయన నివేదిక మేరకు పై ఏడుగురిని సస్పెన్షన్ చేశారు. సెల్‌ఫోన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రాథమికంగా ఆరా తీసి బయటనుంచి పడేస్తున్నారని విచారణలో తేలిందని తెలియజేశారు. డిజీ అంజనీకుమార్ పర్యటనలో భవిష్యత్తులో నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించరని ‘ప్రామిస్’ చేశారని కూడా ‘మీడియా’కు బలంగా చెప్పి వెళ్లారు. కానీ రెండు రోజుల్లోనే తనిఖీలలో బయట నుంచి విధులకు వస్తున్న ఓ గైడ్ టీచర్ వద్ద ‘గుట్కా–హాన్స్’ ప్యాకెట్ దొరకడం ఎంత వరకు సమంజసం? అలాగే కడపలో ఓ యువకుడి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తు తన అవసరం కోసం సెల్‌ఫోన్‌ను వేల రూపాయలను ఖర్చు చేసి రహస్యంగా తెప్పించుకున్నాడు. ఆ సెల్‌ఫోన్‌ను కడప కేంద్ర కారాగారంలోనే భూమిలో దాచిపెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కారాగారంలోకి ‘సెల్‌ఫోన్ సరఫరా’ ఆపలేరని స్పష్టంగా తెలుస్తోంది. సెల్‌ఫోన్‌లను రహస్యంగా ఎవరు తెస్తున్నారు? ఎలా తెస్తున్నారు? అనే విషయాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేయాల్సి వుంది. ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకుని ‘డాగ్ స్క్వాడ్’, బాంబ్ స్క్వాడ్ వారు ఉపయోగించే మెటల్ డిటెక్టర్‌ల సహాయంతో.. కడప కేంద్ర కారాగారాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే మరిన్ని సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా సామగ్రి బయటపడే ఆవకాశాలు ఉన్నాయి. పిడియాక్ట్ రిమాండ్ ఖైదీ జాకీర్ ప్రధాన గేటు వద్దకు వచ్చి తాను 12 సెల్‌ఫోన్‌లు కాదు! ఇంకా సెల్‌ఫోన్‌లను తెప్పించుకుంటానని సవాలు విసిరిన వైనం పై కూడా.. ఎక్కడి నుంచి సెల్‌ఫోన్‌లను తెప్పిస్తున్నాడో పోలీసుల ద్వారా నైనా విచారణ చేయించి నిజానిజాలను తెలుసుకుని ‘సెల్‌ఫోన్’ల సరఫరాను కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై వుంది. జాకీర్ బంధువులు తమకు సహాయపడే ఓ డిప్యూటీ జైలర్ అనంతపురం ‘పీఓఏ’లో విధులను నిర్వహిస్తున్నాడనీ తెలుసుకుని అక్కడికే వెళ్లి, తమకు అనుకూలంగా మాట్లాడుకుని వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సెల్‌ఫోన్‌లను అమ్ముతున్న, సరఫరా చేస్తున్న వారిని పట్టుకుని, తనిఖీల సమయంలో విధుల్లో వున్న, తమకు సంబంధం లేని అధికారులపై చర్యలను మానుకుని, అసలైన దోషులపై చట్టపరంగా చర్యలను తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
సెల్‌ఫోన్‌ల వ్యవహారంలో
నామమాత్రం విచారణ
ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసి ‘మమ’ అనిపించిన అధికారులు
తనిఖీలలో దొరికిన
‘గుట్కా–హాన్స్’ ప్యాకెట్
క్షుణ్ణంగా తనిఖీ చేస్తే బయటపడనున్న సెల్‌ఫోన్‌లు