
● సీఎం సభలో బతుకు పోరాటం
● మాకు వర్తించదా పీ ఫోర్..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ–4 పథకం కింద నిరుపేదలను బంగారు కుటుంబం పేరుతో దత్తత తీసుకుని వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఒకవైపు ఉపన్యాసం ఇస్తుంటే.. మరోవైపు పది సంవత్సరాల బాలుడు తన బతుకు పోరాటం కొనసాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం సాగుతుంటే.. బాలుడు వేరుశనగ కాయల గంప చేతితో పట్టుకుని సమావేశానికి హాజరైన ప్రజల వద్దకు వెళ్లి అమ్మకాలను కొనసాగిస్తున్నాడు. కొంత మంది అధికారులు సైతం ఆ బాలుడు వద్ద నుంచి వేరుశనగ కాయలు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి సమావేశంలోనే బాలుడు తన బతుకు పోరాటం కొనసాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. – జమ్మలమడుగు
జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువులో పీఫోర్ (బంగారు కుటుంబాల లబ్ధిదారుల) సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ప్రజా వేదిక ప్రవేశ ద్వారంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సీఎం ఫ్లెక్సీ కింద ముద్దనూరుకు చెందిన మహిళ తన ముగ్గురు సంతానంతో కలిసి యాచిస్తోంది. అందులో ఒకరు గాంధీ వేషధారణలో ఉండటం గమనార్హం. అక్కడి సదస్సుకు వచ్చిన వారు అయ్యో పాపం వీరికి పీ ఫోర్ వర్తించదా అనుకుంటూ వెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప

● సీఎం సభలో బతుకు పోరాటం