
‘ఇన్ఫోసిస్’ నేత్ర బ్యాంక్ ఏర్పాటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడపలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ప్రాంగణంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నేత్ర బ్యాంక్ ఆవిష్కరించటం జిల్లా ఆరోగ్య సంరక్షణకు అదనపు విలువ జోడిస్తుందని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, స్పెషల్ కలెక్టర్ ఎస్.నిత్యానంద రాజు, రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రామ గిడ్డయ్యలు తెలిపారు. ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలో శుక్రవారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఐ బ్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఐ బ్యాంక్ విస్తరణ పరిధిలో ఇది అయిదవదని తెలిపారు. ఈ నేత్ర బ్యాంక్‌కు అవసరమైన పరికరాలను ఇన్ఫోసిస్ సమకూరుస్తుందని, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల మౌలిక సదుపాయాలను అందిస్తుందన్నారు. కడపలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ప్రారంభించిన హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రాం (హెచ్‌సీపీఆర్) ద్వారా స్వచ్ఛంద నేత్ర దానాలు, విరాళాలను ఇన్ఫోసిస్ ఐ బ్యాంక్ సేకరిస్తుందన్నారు. ఈ నేత్ర బ్యాంక్ పరిసర ప్రాంతాల ప్రజల కార్నియా మార్పిడి చికిత్స అవసరాలను తీరుస్తుందని వివరించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సునీల్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ హెడ్ మనీషా సబూ, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్‌లు మాట్లాడుతూ ఈ అత్యాధునిక ఐ బ్యాంక్‌ను స్థాపించడంలో ప్రసాద్ నేత్ర వైద్యశాలతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ – ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సునీల్ కుమార్ ధరేస్వర్, ఇన్ఫోసిస్ హెడ్ మనిషా సాబూ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల టెక్నాలజీ – కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కృష్ణ వడ్డవల్లి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ ఎమిరేట్స్ రామం ఆత్మకూరి, ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల రాజశేఖర్‌రెడ్డి క్యాంపస్ హెడ్ డాక్టర్ కావ్య మాధురి బెజ్జంకి, నెట్ వర్క్ అసోసియేట్ డైరెక్టర్ ఐ బ్యాంక్ హరిహరన్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.