
సెల్‌ఫోన్లు రికవరీ
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో సెల్‌పోన్లు పోగొట్టుకున్న బాధితులకు రైల్వే పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. శుక్రవారం స్థానిక రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్లు పోయాయంటూ తమకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సీఈఐఆర్ విధానం ద్వారా సెల్‌ఫోన్లు గుర్తించి వాటిని దొంగల నుంచి రికవరీ చేశామన్నారు. నాలుగు సెల్‌ఫోన్‌ల విలువ రూ.53 వేల వరకు ఉంటుందన్నారు.
భార్యపై కరెంట్ వైర్లతో దాడి
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో సప్తగిరి అనే వ్యక్తి తన భార్యపై కరెంట్ వైర్లతో దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాష్ నగర్ కు చెందిన సప్తగిరికి 5 సంవత్సరాల క్రితం వైష్ణవితో వివాహమైంది. భార్యను తరచు వేధించేవాడని, అయితే కరెంటు వైర్లతో గురువారం ఇష్టానుసారంగా చితక బాదడంతో తీవ్ర గాయాల పాలైంది. ఈ మేరకు వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అరటికాయల వ్యాపారి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె సమీపంలో ఉన్న ఎర్రబల్లె తండాలో నివాసముంటున్న ఆంజనేయ నాయక్(42) అనే అరటి కాయల వ్యాపారస్తుడు గడ్డి నివారణ మందు సేవించి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయ నాయక్ అరటి కాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పులివెందుల ప్రాంతంలోని అరటికాయలను ఢిల్లీ వ్యాపారస్తులకు ఎగుమతి చేసేవాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాపారస్తులు సుమారు లక్షలాది రూపాయల డబ్బులు పంపించకపోవడంతో ఆంజనేయ నాయక్ పులివెందుల ప్రాంతంలోని రైతులకు చెప్పుకోలేక గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గడ్డి గడ్డి మందు సేవించిన ఆంజనేయ నాయక్‌ను చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.