
కడప, చిత్తూరు జట్ల ఘన విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లో కడప, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. బుధవారం మూడో రోజు వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 51 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 74.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు సాధించింది. ఆ జట్టులోని మహ్మద్ షారుఖ్ అక్తర్ 105 పరుగులు, ఎస్‌ఎంజి ప్రభాకర్ 37 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంజయ్ 3 వికెట్లు, కిరణ్‌కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో చిత్తూరు జట్టు విజయం సాధించింది. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. చిత్తూరు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో...
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో బుధవారం మూడో రోజు 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 66.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని ఎస్‌వి చైతన్య 4 వికెట్లు, సుశాంత్ 2 వికెట్లు, రిత్విక్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 215 పరుగులు చేసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్‌లో 155 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు విజయం సాధించింది.

కడప, చిత్తూరు జట్ల ఘన విజయం