
నకిలీ పట్టాల తయారీ ముఠా గుట్టురట్టు
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా మరోసారి నకిలీ పట్టాల తయారీ ముఠా గుట్టురట్టు అయింది. ఓ మహిళ తన పేరిట తయారు చేయించిన నకిలీ ఇంటి పట్టాను మరో మహిళకు అమ్మడం ద్వారా నకిలీదిగా గుర్తించిన గోపవరం తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్బన్ పోలీసులు నకిలీ పట్టాల తయారీలో ప్రమేయం ఉన్న 13 మందిపై కేసు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశారు. భారీగా నకిలీ ఇంటి పట్టాలు, పాస్ పుస్తకాలు, సీళ్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరించారు. పట్టణంలోని మార్తోమానగర్‌కు చెందిన దాసరిరత్నమ్మ అనే మహిళ మడకలవారిపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 1012 లోని మూడు సెంట్ల విస్తీర్ణంలోని బీ7 ప్లాట్‌ను పట్టణంలోని శివానగర్‌లో నివాసం వుండే తోడేటి రమణమ్మకు విక్రయించింది. అయితే సదరు పట్టా నకిలీదిగా గుర్తించిన రమణమ్మ గోపవరం తహసీల్దారు త్రిభువన్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి ఈ నెల 19న బద్వేలు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్ నంబర్ 251/2025 కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తొలుత నకిలీ పట్టా తయారు చేసేందుకు సహకరించిన మార్తోమానగర్‌కు చెందిన పొట్టిపాటి ప్రసాద్, పొట్టిపాటి జయపాల్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా సుమిత్రానగర్‌కు చెందిన వీఆర్‌ఓ రామాంజుల ఓబులేసు అలియాస్ కుమార్ ద్వారా నకిలీ పట్టా తయారు చేసినట్లు గుర్తించారు. కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గోపవరం మండలం ప్రాజెక్టుకాలనీకి చెందిన బాబురావు, బద్వేలు మండలం బయనపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌ల సహకారంతో నకిలీ పట్టాను తయారు చేసినట్లు కుమార్ అంగీకరించారు. ఆ మేరకు వారిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారించడంతో పాటు శివాలయం రోడ్డులో కుమార్ అద్దెకు తీసుకున్న ఇంటిలో తనిఖీలు నిర్వహించగా భారీగా అనుబంధ పత్రాలు, ఇంటి డీకేటీ పట్టాలు, నకిలీ పాస్ పుస్తకాలు, సీళ్ళు లభ్యమయ్యాయి. వారి వద్ద తరుచూ ఇంటి పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేయించేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సుమిత్రానగర్‌కు చెందిన రవిశంకర్, గూడెం గ్రామానికి చెందిన చిన్నసుబ్బయ్యలతో పాటు నకిలీ సీళ్లు తయారు చేస్తున్న కడప ఆజాద్‌నగర్‌కు చెందిన బాబు ప్రింటింగ్ ప్రెస్ యజమాని షేక్‌బాబ్జాన్, నకిలీ పాస్ పుస్తకం తయారు చేయించుకున్న కాశినాయన మండలం రెడ్డికొట్టాలు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారయ్యాయరని, విచారణలో మరికొందరి పేర్లను గుర్తించామని, వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి వివిధ మండలాల తహసీల్దారు కార్యాలయాల 46 సీళ్లు, 96 వ్యవసాయ డి.నమూనా పత్రాలు, 280 ఇంటి స్థలాల డీకేటీ పట్టాలు, 28 అనుబంధ పత్రాలు, 70 పట్టాదారు పాసుపుస్తకాలు, 35 పొజిషన్ సర్టిఫికెట్లతో పాటు ఒక ప్రింటర్‌ను, రబ్బర్ సీళ్లు తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచారు. సీఐ రాజగోపాల్, ఎస్‌ఐలు సత్యనారాయణ, కె.జయరామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
13 మందిపై కేసు నమోదు
10 మంది అరెస్టు
భారీగా నకిలీ ఇంటి పట్టాలు,
పాస్ పుస్తకాలు, సీళ్లు స్వాధీనం