
ఆరు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లా లో ఆరు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా కలసపాడులో 4.2 మి.మీ, బి.కోడూ రులో 3.4, కాశినాయన 3, బద్వేలు 1.4, బి.మఠంలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్ కడప జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వ్యాయాయ ఉపాధ్యాయులు 2025–26 నుంచి 2026–2027 వార్షిక సంవత్సరానికి గాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ(అండర్–14, అండర్–17) పోస్టు(ఎస్‌పీఎఫ్)నకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆగస్టు 4వ తేదీలోపు కడప డీఈఓ కార్యాలయంలో ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్ ఆర్‌జేడీగా సురేష్‌బాబు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యామండలి కడప ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీగా కర్నూలు జిల్లా డీఐఈఓగా పని చేస్తున్న సురేష్‌బాబును నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కడప ఆర్‌జేడీగా పని చేస్తున్న శ్రీనివాసులు జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. దీంతో కడప ఆర్‌జేడీగా కర్నూలు జిల్లా డీఐఈఓగా పని చేస్తున్న సురేష్‌బాబును నియమించారు. ఆయన నేడో, రేపు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
సీఎం పర్యటన
ఏర్పాట్ల పరిశీలన
జమ్మలమడుగు: ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జమ్మలమడుగు నియోజకవర్గం పర్యటనకు వస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ శ్రీధర్ చెరకూరి పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో కొన్ని ప్రాంతాలతోపాటు పాలిటెక్నికల్ కాలేజీని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణంతోపాటు బహిరంగ సభకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సభా భవనంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పత్రికా విలేకరులను ఎవ్వరిని అనుమతించలేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి, ఆర్డీఓ సాయిశ్రీ, జాన్ ఇర్విన్, కడప కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం
కడప రూరల్: ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత ఉప సంచాలకులు కె.సరస్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న వృద్ధుల అవసరాలకు తగ్గట్టుగా నర్సులు లేనందున, అక్కడి ప్రభుత్వం మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నర్సులను నియమించే ప్రయత్నం చేస్తోందన్నారు. నర్సింగ్ కోర్సు చేసి ఆ రంగంలో ప్రావీణ్యం పొందిన వారికి జర్మనీ వంటి దేశాలలో అధిక వేతనాలతో ఉద్యోగ భద్రత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వివిద సంస్థలు నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు కేంద్రాలలో ఒక్కొ కేంద్రం ద్వారా 50 మంది మహిళలు చొప్పున (25 మంది ఎస్సీలు, 25 మంది ఎస్టీలు) మొత్తం 150 మందికి జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 8–10 నెలల పాటు (బీఎస్సీ/జీఎన్‌ఎం) నర్సింగ్‌లో డిగ్రీ కలిగిన ఎస్సీ ఎస్టీ మహిళా యువతకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇస్తామని తెలిపారు. విశాఖ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 35 ఏళ్ల వయసు మించకూడదన్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, రెండు సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను స్కాన్ చేసి డీఎస్‌సీడబ్ల్యూఈఓటీపీటీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపాలన్నారు. హార్డ్ కాపీలతో చిత్తూరు జిల్లాలోని కొత్త కలెక్టరేట్ అంబేడ్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్ సంక్షేమ సాధికారత శాఖను కలవాలని సూచించారు.

ఆరు మండలాల్లో వర్షం

ఆరు మండలాల్లో వర్షం