
గండి క్షేత్రం.. సప్తవర్ణ శోభితం
చక్రాయపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతోంది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులు మైమరిపిస్తున్నాయి. గండిలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు తొలి శ్రావణ మాస శనివారోత్సవం జరగనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆవరణలో పలు దేవతామూర్తుల డిజిటల్ కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయం సప్తవర్ణ శోభితంతో ప్రకాశిస్తోంది. శ్రీవీరాంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. రాత్రి భక్తుల కాలక్షేప నిమిత్తం హరికథలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు.
ప్రత్యేక అలంకరణ
శ్రావణ మాస శనివారం సందర్భంగా మూలవర్లుకు ప్రత్యేక పూల అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ప్రధాన, ఉపప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్ తెలిపారు. శ్రావణ శనివారాల్లో ఎలాంటి అభిషేకాలు, వాహన పూజలు ఉండవని వారు చెప్పారు. శనివారం ఉదయం 3.30 నుంచి 4 గంటల వరకు సుప్రభాతం, 4 నుంచి 4.30 వరకు అభిషేకం, 4.30 నుంచి 5 వరకు అలంకరణ, అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహానైవేద్యం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
పటిష్ట బందోబస్తు
ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగారావు తెలిపారు. తొలి శనివారం సందర్భంగా ముగ్గురు ఎస్సైలు, 90 మంది పోలీసులను బందోబస్తుకు నియమించడం జరిగిందన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేడతామని చెప్పారు. భక్తుల రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఉత్సవాల ప్రశాంత నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
నేడు తొలి శనివారోత్సవం
భారీగా తరలిరానున్న భక్తులు
ప్రత్యేక ఏర్పాట్లు

గండి క్షేత్రం.. సప్తవర్ణ శోభితం