
ఈ–నామ్ ఎందుకు అమలు చేయడం లేదు?
పులివెందుల: పులివెందుల మార్కెట్ యార్డులో ఈ నెలలోనే ఈ–నామ్(జాతీయ వ్యవసాయ మార్కెట్) వ్యవస్థను తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. రైతులు పండించిన ఉత్పత్తులను మరింత మెరుగైన ధరకు విక్రయించేందుకు ఈ–నామ్ వ్యవస్థలో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీనీ పంటకు అందుతున్న ధరలు, మార్కెట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, సంబంధిత అంశాలపై రైతులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించే చీనీ పంట ఏడాదిలో రెండు దపాలు మాత్రమే చేతికి అందుతుందని, అలాంటి పంటకు సరైన ధర అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైతులు పండించే పంటకు గ్రేడింగ్ చేసేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని సంఘటితం చేసి ఎఫ్‌ఈఓలను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు గ్రేడింగ్ చేయకపోవడం, చీనీ పంట ధరలను ప్రదర్శించకపోవడం, కంప్యూటరైజ్డ్ చేయకపోవడం, సంబంధిత అంశాలకు సంబంధించి మార్కెట్ శాఖ అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
పారదర్శకతతో వ్యాపారం జరగాలి
హమాలీలకు ఎంత ఖర్చవుతుంది, రైతులకు నగదును ఆన్‌లైన్ ద్వారా లేక క్యాష్ రూపంలో అందిస్తున్నారా, పారదర్శకత రాకపోతే బయటి నుంచి ట్రేడర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, కమీషన్ ఏజెంట్లు నియమ నిబంధనలకు లోబడి పని చేయా లన్నారు. పులివెందుల మార్కెట్ యార్డులో ఈ–నామ్ వ్యవస్థను తీసుకొచ్చి ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం జరిగేలా, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో చీనీ పంట ధరలను డిజిటల్ సైన్ బోర్డుల ద్వారా ప్రదర్శించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారదర్శకతతో వ్యాపారం చేయడం ద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ట్రేడర్లు వచ్చి కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారన్నారు. ఈ దిశగా మార్కెటింగ్ శాఖ పని చేయాలని సూచించారు. ప్రధానంగా రైతులను సంఘటితం చేసేందుకు వ్యవసాయ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవి చంద్రబాబు, పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, మార్కెటింగ్ శాఖ డీడీ లావణ్య, ఏడీ ఆజాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కష్టపడి పండించిన పంటకు ప్రతిఫలం అందాలి
రైతు సంఘాలు ఏర్పాటు చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి