
ఆగస్టు 15 నాటికి బంగారు కుటుంబాల దత్తత
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఆగస్టు 15వ తేదీ నాటికి బంగారు కుటుంబాల దత్తత పూర్తికావాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి పీ4 ఐయాం మార్గదర్శి, బంగారు కుటుంబాల దత్తత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమావేశం అనంతరం జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ జిల్లాలో పి4 ఐ యామ్ మార్గదర్శి కార్యక్రమం పక్కాగా అమలు జరగాలన్నారు. అలాగే బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల ఎంపిక పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లో పీ4 ఐ యామ్ మార్గదర్శి కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు సిఎస్‌ఆర్ ఫండ్ ని పి4కు అనుసంధానం చేసి, బంగారు కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు షార్ట్ టర్మ్, మీడియం, లాంగ్ టర్మ్ ప్రణాళిక రూపొందించుకొని మార్గదర్శులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ హజ్రతయ్య, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.