
గాడి తప్పిన వైవీయూ పాలన
సాక్షి టాస్క్‌పోర్స్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలకు తలమానికంగా నిలుస్తూ వచ్చిన యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారేలా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాది పూర్తయినా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, రెగ్యులర్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో పాలన గాడితప్పింది. దీంతో విశ్వ విద్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. అధ్యాపకులు పని లేక ఒకరిపై ఒకరు దూషణల పర్వం కొనసాగిస్తూ విశ్వ విద్యాలయ ప్రతిష్టను మంట కలుపుతున్నారు. మరోవైపు చిరుద్యోగులకు వేతనాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా 2006 మార్చిలో పురుడు పోసుకున్న యోగి వేమన విశ్వ విద్యాలయం అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాదిస్తూ ఖ్యాతి అర్జించింది. న్యాక్ ఎ గ్రేడ్ సాధించడంతోపాటు ఎన్‌ఐఆర్‌ఎప్ ర్యాకింగ్‌లో టాప్100లో నిలిచింది. ఇంతటి ప్రతిష్ట కలిగిన విశ్వ విద్యాలయానికి రెగ్యులర్ అధికారులను నియమించకపోవడంతో పాలన గాడి తప్పి ఇష్టారాజ్యంగా తయారైంది. గత ఏడాది రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బలవంతంగా రాజీనామా చేయించిన సంగతి తెలిసింది. అనంతరం ఆచార్య పణితి ప్రకాష్‌బాబును ప్రభుత్వం నియమించినా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అప్పటి నుంచి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, రెగ్యులర్ రిజిస్ట్రార్లు లేక పాలన పూర్తిస్థాయిలో గాడి తప్పింది. తాజాగా విశ్వ విద్యాలయంలోని ఓ ఆర్ట్స్ విభాగంలో ఇద్దరు మహిళా ఆచార్యులు మధ్య దూషణల పర్వం జరగడమేగాక ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది. ఆచార్యలమన్న స్థాయి మరిచి వర్ణించిలేని పదాలతో దూషణకు దిగడంతోపాటు ప్రిన్సిపాళ్లకు ఫిర్యాదుల మోత మోగించినట్లు తెలిసింది. కొందరు సంఘాల నాయకులు ఇరువర్గాలకు వత్తాసు పలుకుతూ మరోవైపు రాజీ కార్యక్రమాలకు పాల్పడుతూ బోధనను గాలికి వదిలి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నట్లు చర్చ సాగుతోంది. దీంతోపాటు సైన్సు విభాగానికి చెందిన ఒక యువ అచార్యుడిపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం కమిటీ విచారణను చేపట్టింది. మరో వైపు చిరుద్యోగులకు వేతనాలు అందించడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. జులై 25వతేదీ వస్తున్నా జూన్ నెల వేతనాలు వేయకపోవడంతో చిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు విశ్వవిద్యాలయంలో సక్రమంగా సమయపాలన పాటించడం లేదు. అన్ని శాఖలో బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం అములు చేస్తుండగా.. వైవీయూలో మాత్రం లేకపోవడంతో ఆచార్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది చర్చ సాగుతోంది. వైవీయూలో దాదాపు పది విభాగాల్లో విద్యార్థులు లేకపోవడంతో లక్షల్లో వేతనాలు తీసుకునే అచార్యులు ఖాళీగా కూర్చొంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. న్యాయ కళాశాలలు, బీఈడీ కళాశాలల్లో అవినీతి బాగోతాలను విద్యార్థి సంఘాలు ఎత్తి చూపుతుండడంతో విశ్వవిద్యాలయం అట్టుడకుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రెగ్యుర్ అధికారులను నియమించి విశ్వ విద్యాలయ ఖ్యాతిని కాపాడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసులు వివరణ కోరగా కెమిస్ట్రీ అచార్యుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ వేసి విచారణ చేయించామన్నారు. దీంతోపాటు ఆర్ట్స్ విభాగంలో మహిళా అచార్యులు దూషణల పర్వంపై మాట్లాడగా నాకు సమాచారం తెలిసింది...విచారిస్తామన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల జీతాల విషయమై మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్ తక్కువగా ఇస్తుందని దీంతో వన్‌ౖబై జీతాలను ఇస్తున్నామని తెలిపారు.
రెగ్యులర్ అధికారి లేక ఇష్టారాజ్యం
మహిళా అధ్యాపకుల మద్య
దూషణల పర్వం
ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు