
మైనర్ బాలిక కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేం
కడప అర్బన్: గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని, కేసును వీలైనంత తొందరగా ఛేదిస్తామని డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుందని, సెల్ టవర్ ఆధారంగా 350 మందిని గుర్తించామన్నారు. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగిందన్నారు. రెండు సెల్ టవర్లు ఒకే ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రాంతంలో 300 మందిని విచారించామని, మిగిలిన 50 మందిని విచారించాల్సి ఉందన్నారు. గత పది రోజులుగా 10 మంది అధికారులు అదే కేసుపై సీరియస్‌గా ఉన్నారన్నారు. గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వకుండా పకడ్బందీగా చెప్పడం జరిగిందన్నారు. టూరిస్ట్ ఔట్ పోస్ట్ లో తనిఖీలు కంటిన్యూగా ఉంటాయన్నారు. మైనర్లు ఒంటరిగా గండికోట ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ స్థలాల కబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బి.కోడూరు మండలంలో ప్రభుత్వ భూములు బడా నాయకుల అడ్డాగా మారాయి. ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు ఒక పక్క రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చోద్యం చూస్తున్నారు. దీంతో ఆక్రమణదారుల అగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. ముఖ్యంగా బి.కోడూరు మండలం మున్నెల్లి, కామకుంట, ఐత్రంపేట గ్రామపొలాలకు మంచి రేట్లు పలుకుతుండటంతో ఆక్రమణదారుల కన్ను పడింది. వంకలు, వాగులను వదలకుండా ఆక్రమిస్తున్నా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కిమ్మకుండిపోతున్నారు. కూటమి నేతలు గతంలో ఎన్నడూలేని విధంగా ఇష్టానుసారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ చదునుచేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. మండలంలోని కామకుంట పొలం సర్వే నెంబర్ 183/1, 183/2లలో, వేమకుంట పొలం సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఇప్పటికే చదును చేసి పొలం చుట్టూ కంచె ఏర్పాటుచేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఎంపీపీ, స్థానిక నాయకులు తెలిపారు. అధికారులు చొరవచూపి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంచాలని మండల వాసులు కోరుతున్నారు.