
వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని పాపాఘ్ని నదిపై ఉన్న పాత వంతెన వద్ద కడప నగరానికి చెందిన సయ్యద్ రసూల్ (52) విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన సయ్యద్ రసూల్ బుధవారం కమలాపురంలో ఉన్న తన కుమార్తె జైబీన్ ఇంటికి వచ్చాడు. పాపాఘ్ని నది వద్దకు వెళ్లి వంతెన కింద విష ద్రావణం తాగి తన కుమార్తెకు ఫోన్ చేసి తనను దేవుడు రమ్మంటున్నాడని, తాను బ్రిడ్జి వద్ద ఉన్నానని, మీ అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. దీంతో కుటుంబీకులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో పడి ఉండటంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు కమలాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు.
లారీ ఢీ కొని
రెండు గేదెలు మృతి
కొండాపురం : మండల పరిధిలోని ఓబన్నపేట పునరావాస కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిలో పాల లారీ ఢీ కొని రెండు పాడిగేదెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల మేరకు మండలంలోని ఓబన్నపేట గ్రామ రైతు తలారి పెద్ద గుర్రప్పకు చెందిన పాడి గేదెలు మేతకోసం వెళ్లి తిరిగి వస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వస్తున్న పాలలారీ ఢీ కొంది. దీంతో రెండు పాడిగేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో గేదెకు తీవ్ర గాయాలయ్యయి. గేదెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు.
బాలిక కిడ్నాప్ కేసులో
నిందితుడి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్‌పేటకు చెందిన బాలిక(17)ను ఈనెల 16న అదే ప్రాంతానికి చెందిన సత్యరాజ ముని శ్రావణ్‌కుమార్ (22) అనే యువకుడు మాయమాటలు చెప్పి, కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్లాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కడప టూటౌన్ ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బాలికను, నిందితుడిని పట్టుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ బాలికలు, మహిళలపట్ల ఎవరైనా వేధింపు చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైరు చోరీ
ముద్దనూరు : మండలంలోని ఆరవేటిపల్లె గ్రామంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని కాపర్‌వైరును బుధవారం రాత్రి చోరీ చేసినట్లు బాధిత రైతు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టారని, దీంతో విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య