
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
కడప అగ్రికల్చర్ : గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహించి ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. గురువారం కడపలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతు సేవా కేంద్రాల వీఏఏ, వీహెచ్‌ఏలకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు కడప వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పెండ్లిమర్రి, ఖాజీపేట, చెన్నూరు,ఒంటిమిట్ట, చింతకొమ్మదిన్నె, కడప మండలాల రైతు సేవా కేంద్రాల వీఏఏ, వీహెచ్‌ఏలు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన నేల సారవంతంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చనే విషయాలను రైతులకు తెలియజేయాలన్నారు. అలాగే పంటసాగు చేసిన ప్రతి రైతుకు ఈ–పంట నమోదు చేయాలన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్ర మాట్లాడుతూ ఉద్యాన పంటలైన అరటి, నిమ్మపంటలను ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చో వివరించారు. కడప సహాయ సంచాలకుడు సురేష్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ప్రకృతి వ్యవసాయ పదెంధతులైన జీవామృతం, ఘణ జీవామృతం, ద్రవ జీవామృతం, కషాయలు ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుని రైతులకు తెలియజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు కృష్ణసుమంత్‌రెడ్డి, ఈశ్వరరెడ్డి, శ్రీదేవి, నాగార్జున, జయలక్ష్మి, ఉద్యానశాఖ అధికారి జీవన్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల వీఏఏలు, వీహెచ్‌ఏలు పాల్గొన్నారు.
వీఏఏ, వీహెచ్‌ఏలకు
జిల్లా వ్యవసాయ అధికారి సూచన