
సాక్షి, వైఎస్సార్: ఏపీలో మంత్రి నారా లోకేశ్‌కు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీటెక్ రవి, వాసును లోకేశ్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. విష సంస్కృతికి తెరతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందులలో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నీ అమలు చేశామని ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సూపర్ సిక్స్ మా ప్రథమ ప్రాధాన్యం అన్నారు.. ఇప్పుడు అన్నీ అమలు చేశాం అంటున్నారు. పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు.. వారి నాలుక మందం అంటున్నాడు. అచ్చెన్నాయుడు అయితే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు మీరు ఇచ్చారా?. 50 ఏళ్లు దాటిన మహిళకు పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. మీరు ఇచ్చిన సిలిండర్లు ఎంత మందికి చేరాయి అనేది గ్రామాలకు వెళ్ళి అడుగుదాం రండి. మేము ప్రశ్నించడం మొదలు పెట్టే సరికి తల్లికి వందనం అన్నారు.. అది కూడా అందరికీ రావడం లేదు. ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల కష్టాలపై పోరాడటమే.
లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది..
నువ్వు ఇవన్నీ అమలు చేయకుండా మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు. లక్ష కోట్లు అన్న లిక్కర్ కేసు చివరికి ఎన్ని కోట్లకు వచ్చింది. అసలు ఆధారాలు లేకుండా ఒక కట్టు కథ అల్లి కేసులు కట్టారు. జూన్ 12న మీరు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పాత లిక్కర్ పాలసీ 6 నెలల కొనసాగింది. మరి ఆరు నెలల్లో మీకు ఎన్ని వేల కోట్లు వచ్చాయి?. వాటిని పత్రికలు అనాలో.. ఇంకా ఏం అనాలో అర్థం కావడం లేదు. అన్నీ కలిపి జగన్ ఇంటికి ఆ డబ్బంతా వెళ్ళింది అంటారు. మరి ఈ ఆరు నెలల్లో డబ్బు మీ ఇళ్లకు చేరిందా?. ప్రభుత్వ అధీనంలో మద్యం అమ్మకాలు జరిగితే ఇక ఏ విధంగా స్కాం జరుగుతుంది?.
స్కాం జరిగింది అప్పు డు కాదు.. ఇప్పుడు జరిగేది స్కాం. ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు అదనంగా అమ్ముకున్నావు. దాని వల్ల 10వేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లుతోంది. జగన్ బ్రాండ్స్ అన్నావు.. అవన్నీ నీ హయాంలోనే అనుమతులు ఇచ్చావు. మీరు ఇచ్చిన అనుమతులు.. మా బ్రాండ్లు ఎలా అవుతాయి?. జగన్‌పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. నువ్వు చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను మాట్లాడుతుంటే భరించలేక తప్పుడు కేసులు, ఇష్టారీతిన మాటలు మాట్లాడుతున్నారు.
లోకేశ్, బీటెక్ రవికి వార్నింగ్..
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీటెక్ రవి.. లోకేశ్ గురించి మాట్లాడకూడదు అంటున్నారు. లోకేష్ భరించలేక వీళ్లతో నన్ను విమర్శించాలని ఆదేశాలు ఇస్తున్నాడు. మీ పార్టీకి లోకేష్ యువరాజు కావచ్చు.. అయితే నాకేంటి?. నా ధర్మంతో నేను ప్రవర్తిస్తున్నా.. నేను ఎందుకు టీడీపీకి ఎందుకు రాజీనామా చేసాను అనేది వాళ్లకి తెలుసు. నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది?. మొన్నటికి మొన్న రమేష్ రెడ్డి ఇంటిపై మంత్రి స్థాయి వ్యక్తి తాగుబోతులతో దాడి చేయిస్తాడా. బీటెక్ రవి.. నువ్వు బయటపెడితే.. నేను భయపడతానా?. నువ్వు ఏ రకమైన బాషా మాట్లాడతావో నా నుంచి సమాధానం అదే భాషలో ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి.

ఈరోజు మా వెనుక పోలీసులు లేకపోవచ్చు.. నువ్వు ఏదైనా చేస్తే భవిష్యత్తులో అనుభవిస్తారు. లోకేష్.. కడపలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావ్.. ఇక్కడ ఎవరు భయపడరు. చావే నా దగ్గరకు వస్తే.. నా మీసంపై నా చేయి ఉంటుంది. తమాషాలు పడుతున్నావా లోకేష్.. ఇక్కడ మీ వాళ్లని భౌతికంగా దాడి చేయమంటావా?. ఏం చేస్తావో చెయ్.. నేను సిద్ధంగా ఉన్నాను. బైరటీస్ మైనింగ్ పెద్ద కుంభకోణం జరిగిందని మీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. దమ్ముంటే దానిపై మాట్లాడండి. నాకు డంకీలు ఇవ్వడం కాదు.. జిల్లాకు ఏం కావాలో మీ నాయకులను అడగండి. ఈ ఏడాది కాలంలో జిల్లాకు ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రూపాయి ఇచ్చే దిక్కు లేదు కానీ.. బనకచర్ల చేస్తాడట అంటూ ఘాటు విమర్శలు చేశారు.