
పల్లె నుంచి.. ఎస్‌బీ ఏసీపీగా..
వేంపల్లె : పల్లెలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో అతడు ఒకరయ్యారు. కష్టపడి చదివిన ఆయన నేడు ఉన్నత స్థాయి అధికారిగా బాధ్యతలు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అతడే వేంపల్లెకు చెందిన నర్రెడ్డి భానుప్రకాష్‌రెడ్డి. విజయవాడలో ఎస్‌బీ ఏసీపీగా శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
వీరపునాయునిపల్లె మండలం గోనుమాకులపల్లెకు చెందిన నర్రెడ్డి గంగాధర్‌రెడ్డి, అమరావతి(టీచర్) దంపతులకు ఇద్దరు కుమారులు. తమ పిల్లలను చదివించుకునేందుకు 20 ఏళ్ల కిందట గోనుమాకులపల్లె నుంచి వేంపల్లెకు వచ్చారు. వీరి కుమారుడైన నర్రెడ్డి భానుప్రకాష్‌రెడ్డి వేంపల్లె జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో 6, 7వ తరగతులు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీచైతన్య పాఠశాలలో చదివారు. తిరుపతి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తంజావూరులో బీటెక్ డిగ్రీ పూర్తిచేశారు. చదువు పూర్తయిన తర్వాత ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగిగా పనిచేస్తూనే గ్రూపు–1కు సిద్ధమవుతూ వచ్చారు. ఈ క్రమంలో 2018లో గ్రూపు–1 టాపర్‌గా నిలిచి గ్రేహౌండ్స్ డీఎస్పీగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన దశల వారీగా ఉన్నతోద్యోగాలకు ఎంపికవుతూ వచ్చారు. తాజాగా విజయవాడ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. వేంపల్లెకు చెందిన వ్యక్తి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇద్దరు బిడ్డల్లో ఒకరు బ్యాంకులో, మరొకరు ఏసీపీగా ఉద్యోగాలు చేయడంతో గంగాధర్‌రెడ్డి, అమరావతి దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేంపల్లె యువకుడి ఘనత