
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి
కడప అర్బన్ : సమస్త జీవరాశికి, పర్యావరణానికి పెనుముప్పులా మారిన ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి సవాలుగా మారిన ప్లాస్టిక్ వాడకం లేకుండా ఇతర పర్యావరణహిత ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని సూచించారు. రేపటి తరానికి ప్లాస్టిక్ రహిత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. పోలీసులు క్రమశిక్షణతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్.ఐ లు ఆనంద్, టైటస్, శివరాముడు, శ్రీశైల రెడ్డి, వీరేష్, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.