బియ్యం బండి.. ఇక రాదండి.! | - | Sakshi
Sakshi News home page

బియ్యం బండి.. ఇక రాదండి.!

May 28 2025 11:44 AM | Updated on May 28 2025 11:44 AM

బియ్య

బియ్యం బండి.. ఇక రాదండి.!

కడప సెవెన్‌రోడ్స్‌ : పనీపాట వదులుకుని రేషన్‌ షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు, కొండవీటి చేంతాడంత క్యూలైన్లు. తోపులాటలు, వాగ్వాదాలు తీరా తమవంతు వచ్చేసరికి సర్వర్‌ మొరాయిస్తే ఇక చేసేదిలేక ఊసూరుమంటూ ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి. మళ్లీ మరుసటిరోజు సంచి పట్టుకుని బియ్యం కోసం ఉరుకులు పరుగులు.. జూన్‌ 1వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ చౌక దుకాణాల వద్ద మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ప్రతినెల ఇంటి ముంగిటకే వచ్చి పేదలకు ఇన్నాళ్లూ సరుకులు అందిస్తున్న బియ్యం బండ్ల (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌)ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే ఇందుకు కారణం. మరో పక్క ఉపాధి కోల్పోయిన ఎండీయూ ఆపరేటర్లు తమ భవిష్యత్తు ఏమిటో అర్థం గాక సతమతమవుతున్నారు.

జిల్లాలో 1239 ప్రభుత్వ చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో అంత్యోదయ అన్నయోజన కార్డులు 36,031 ఉండగా, అందులో 97,878 మంది సభ్యులు ఉన్నారు. తెల్లకార్డులు (డబ్ల్యుఏపీ) 5,42,746 ఉండగా, అందులో 16,43,489 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం మీద 5,78,777 బీపీఎల్‌ కార్డులు ఉండగా, 17,41,367 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, చక్కెర తదితర నిత్యావసర సరకులు పొందుతున్నారు. ఎఫ్‌పీ షాపుల వద్ద కార్డుదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గతంలో ఉండేవి. అలాగే అనేక గ్రామాల ప్రజలకు ప్రభుత్వ చౌక దుకాణం అందుబాటులో ఉండేది కాదు. నిత్యావసర సరుకుల కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన నాటి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఇంటి ముంగిటకే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీడీఎస్‌లో ఈ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. రేషన్‌షాపు డీలర్ల ఉపాధికి ఏమాత్రం దెబ్బతగలకుండా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఎండీయూ) వాహనాలను ప్రవేశపెట్టారు. 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారు వాటాతో ఎండీయూ వాహనాలను సమకూర్చారు. ఇందువల్ల బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, సామాజిక న్యాయం, సాధికారత లభించింది. బియ్యం బండి ఎప్పుడు వస్తుందో ముందుగానే వలంటీర్లు కార్డుదారులకు తెలియజేసే వారు. ఇందువల్ల వినియోగదారుల రోజువారి పనులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడేది కాదు. గంటల తరబడి క్యూలో నిలుచునే పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. అలాగే తమకు సరుకులు అందలేదని ఫిర్యాదులుసైతం లేవు. ఇప్పటివరకు ఎండీయూ వాహనాల పద్ధతి ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సవ్యంగా అందుతున్నాయి.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారు అయ్యాయి. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందనే ముద్ర పేదల గుండెల్లోనుంచి చెరిపేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు ఎండీయూ వాహనాలను తొలగించడం ద్వారా నిరుద్యోగ యువతను రోడ్లపాలు చేస్తున్నారు. ఎండీయూ వాహనాలకు సంబంధించి 2027 వరకు ప్రభుత్వంతో ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని కాదని వాహనాల తొలగింపునకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. జూన్‌ 1 నుంచి కార్డుదారులు రేషన్‌షాపుల వద్దకే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం సరుకులను డోర్‌ డెలివరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే డోర్‌డెలివరీ ఎవరు చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. జూన్‌ 1 నుంచి ఎఫ్‌పీ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అంశంపై ఇటీవల జేసీ అదితిసింగ్‌ కలెక్టరేట్‌లో జిల్లాలోని డీలర్లతో సమావేశం కూడా నిర్వహించారు. ప్రతినెల 1 నుంచి 15వ తేది వరకు సరుకుల పంపిణీ జరగాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని ఆమె ఆదేశించారు.

ఎండీయూ ఆపరేటర్ల ఆవేదన

కడప నగరానికి చెందిన ఎండీయూ ఆపరేటర్‌ సుధాకర్‌ సాక్షితో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాలు తమకు ఇచ్చారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం సమకూర్చిందన్నారు. లబ్ధిదారు వాటా కింద తాను 10 శాతం అంటే రూ.63 వేలు చెల్లించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో ఆరు సంవత్సరాల అగ్రిమెంటు కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రతినెల 21 వేల రూపాయల తమ వేతనంలో రూ.3000 ప్రభుత్వమే మినహాయించుకుని బ్యాంకు రుణం చెల్లించేదన్నారు. మిగతా రూ. 18 వేలు తమకు అందిస్తుండేదన్నారు. నిరుద్యోగినైన తనకు ఉపాధి లభించడంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. ఇంకా 20 నెలల అగ్రిమెంటు గడువు ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఇప్పడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఎండీయూ ఆపరేటర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం తమకు 2027 వరకు గడువు ఉందన్నారు. ప్రతినెల ప్రభుత్వం నుంచి రూ. 18 వేలు వేతనం అందడం వల్ల తమ కుటుంబాన్ని పోషించుకునే వారమన్నారు. ఇప్పుడు హఠాత్తుగా బియ్యం బండ్లను తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. బ్యాంకుల నుంచి ఎన్‌ఓసీ వచ్చినంత వరకు బియ్యం బండ్లను కొనసాగించాలని, ప్రభుత్వం తమ ఉపాధిని దెబ్బతీయడం తగదని పేర్కొన్నారు.

సరుకుల కోసం రేషన్‌ షాపులకు

వెళ్లాల్సిందే

కార్డుదారులకు ఇక తప్పని తిప్పలు

ఉపాధి కోల్పోయిన ఎండీయూ ఆపరేటర్లు

ప్రజల్లో జగన్‌ ముద్ర చెరిపేయడమే

బాబు లక్ష్యం

పనులు పోగొట్టుకోవాల్సి వస్తుంది

ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కష్టాలు దృష్టిలో ఉంచుకుని ఇంటివద్దకే రేషన్‌ అందించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి వల్ల మాలాంటి పేదలు పనులు పోగొట్టుకుని రేషన్‌ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి లేకుండా ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడమే కాకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడే బియ్యం బండ్లను తొలగించడం అన్యాయం.

– జె.అమ్ములు, రామాంజనేయపురం, కడప

ఇంటి దగ్గరకే రేషన్‌ అందించాలి

ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించడం వల్ల మాలాంటి వారికి ఎంతో సౌలభ్యంగా ఉండేది. బియ్యం బండి ఎప్పుడు వస్తుందో సమాచారం అందించేవారు. కనుక ఆ సమయంలో అందుబాటులో ఉండి సరుకులు తీసుకు వెళ్లేవారం. గతంలో మాదిరి రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేకుండా ఉండేది. ఇప్పుడు బియ్యం బండ్లు తీసివేస్తే పనులన్నీ వదులుకొని రేషన్‌షాపుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుంది. పైగా వెళ్లిన రోజే రేషన్‌ అందుతుందనే నమ్మకం లేదు. ఇంటి వద్దకే రేషన్‌ అందించే పద్ధతినే కొనసాగించాలి.

– అబ్దుల్‌, రాజారెడ్డి వీధి, కడప

బియ్యం బండి.. ఇక రాదండి.!1
1/2

బియ్యం బండి.. ఇక రాదండి.!

బియ్యం బండి.. ఇక రాదండి.!2
2/2

బియ్యం బండి.. ఇక రాదండి.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement