
పంట ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా..!
మైదుకూరు : పంట ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా ఈనెల 29 నుంచి 15 రోజుల పాటు దేశంలోని 700కుపైగా జిల్లాల్లో కృషి సంకల్ప అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్యక్రమాలను నిర్వహించనుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ఆధ్వర్యంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమ లక్ష్యం ప్రధానంగా పంట ఉత్పత్తులను పెంచడమే. గతంలో దేశంలోని ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు లేక ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి మారి ఇప్పుడు దేశ ప్రజల అవసరాలు తీరి మనమే ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్నాం. అయితే పంట ఉత్పత్తులను మరింత పెంచడం ద్వారా ప్రజలకు మరింత పౌష్టికాహారాన్ని అందించాలన్నదే కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను అందించడం, పంటల సాగులో ఆధునిక పద్ధతులను సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించనున్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం..
పంట దిగుబడులను పెంచడమే కాక రైతు విచక్షణారహితంగా పంటల సాగులో పురుగు మందులను వినియోగించకుండా చూడటం కూడా ఈ కార్యక్రమాల లక్ష్యం. ఇందు కోసం రైతుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా అవగాహన కల్పించడం చేస్తారు. సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని సూచిస్తారు. తద్వారా ప్రమాద రహిత ఆహారాన్ని అందరికి అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు..
‘‘ప్రయోగశాల నుంచి భూమికి’’ అనే నినాదంతో కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, కొత్త రకాలు, ప్రభుత్వ పథకాలు, సాంతికేక పరిజ్ఞానం, పంటల వైవిధ్యం అంశాలుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడతారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఖరీఫ్‌లో సాగు చేసే పంటల ఉత్పత్తులను పెంచడం, పెట్టుబడులను తగ్గించడంపై అవగాహన కల్పిస్తారు. రైతుల జీవనోపాధిపై భరోసా కల్పించడం, లాభసాటి వ్యాపార సరళిలో వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు వ్యవసాయంపై మక్కువ కలుగజేయడమే కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం.
29 నుంచి కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు
శాస్త్రవేత్తలు, అధికారుల బృందాలతో వ్యవసాయంపై అవగాహన