
మహానాడును విజయవంతం చేయాలి
కడప రూరల్ : కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. శనివారం ఆ పార్టీకి చెందిన నేతలు మహానాడు ప్రాంగణంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి రెండు రోజులు 23 వేల మంది ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. చివరి రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామని, పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు అనగాని సత్యప్రసాద్, సంధ్యారాణి, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులురెడ్డి, బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు.
కరోనా లేదు ఏమీ లేదు
కరోనా లేదు ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులు కరోనా ఉన్న సమయంలో మహానాడును నిర్వహించవచ్చా అని ప్రశ్నించారు. దీనికి శ్రీనివాసులురెడ్డి స్పందించారు. మహానాడును చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు కరోనాను సాకుగా చూపిస్తున్నారని తెలిపారు. కరోనా లేదు ఏమీ లేదని తెలిపారు. మహానాడును విజయవంతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.