
కరోనా విజృంభిస్తుంటే మహానాడా?
కడప సెవెన్‌రోడ్స్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈనెల 27 నుంచి 29 వరకు కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని తక్షణమే వాయిదా వేసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 4097 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని, ప్రభుత్వం మాత్రం 265 కేసులు వచ్చాయని చెబుతోందన్నారు. ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. ఇది కొత్త వేరియంట్ కావడంతో పరిస్థితి క్రిటికల్‌గా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో లక్షలాది మందిని తరలించి మహానాడు నిర్వహిస్తే కరోనా కొన్ని కోట్ల మందికి చేరే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే టీడీపీకి లెక్కలేదన్నారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది, ఎన్నికల సభలో 8 మంది, గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సమయంలో ముగ్గురు మృతి చెందారని వివరించారు. టీడీపీకి ప్రజల పట్ల బాధ్యత ఉంటే మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ముసుగులో మహానాడు ఏర్పాట్లన్నీ అధికారులే చేస్తున్నారని విమర్శించారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రజలకు ఏం చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఏం ఘనకార్యం చేశారని మహానాడు నిర్వహిస్తున్నారని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 146 హామీలలో పెన్షన్లు తప్ప మిగతా ఏవీ అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. దేశంలో కరోనా వ్యాపిస్తోందని, కడపలో ఇప్పటికే 2 కేసులు నమోదైనట్లు రిమ్స్ సూపరింటెండెంట్ ధ్రువీకరించారన్నారు. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం వాటినే తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మహానాడు వాయిదా వేసుకోవాలని కోరారు.
జేసీకి వైఎస్సార్‌సీపీ నేతల వినతి
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని, ఇప్పటికే పలుచోట్ల మరణాలు సంభవించాయని, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తదితరులు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై తమ రాష్ట్ర పార్టీ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్, కార్పొరేటర్ షఫీ, సీహెచ్ వినోద్‌కుమార్, శ్రీరంజన్‌రెడ్డి, పాకా సురేష్, దాసరి శివప్రసాద్, యానాదయ్య, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలు మీరే ఉల్లంఘిస్తే ఎలా
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసుకోండి
వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు