
ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం మేరకే గదుల కూల్చివేత
కడప కల్చరల్ : సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం మేరకే సీఎస్‌ఐ బాయ్స్ హాస్టల్ గదులను కూల్చివేశామని సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ యు.సాల్మన్, సెక్రటరీ రెవరెండ్ సి.సాల్మన్, అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ పీఎస్.వినయ్‌కుమార్ తెలిపారు. సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ కార్యాలయంలో విలేరులతో శుక్రవారం వారు మాట్లాడుతూ స్కూల్ నడుపుకొనేందుకు షర్మిలకు తాము ఎలాంటి లీజు ఇవ్వలేదని, అగ్రిమెంట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో న్యూ మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు ఇచ్చిన లీజు గడువు పూర్తవగా.. వారు తమకు అప్పగించారన్నారు. తమకు తెలియకుండా షర్మిల లీజ్ ఒప్పందం కుదుర్చుకుని నడుపుతోందన్నారు. బాయ్స్ హాస్టల్ గదులు శిథిలావస్థకు చేరాయని, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం జరగకూడదని భావించి గదులు కూల్చే ప్రయత్నం చేశామన్నారు. షర్మిలకు ఏడాది కాలం విద్యా సంస్థ నడుపుకొనేందుకు అంగీకరించామని, మూడేళ్లు గడచినా ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతోందని వారు తెలిపారు. ఇందులో సీఎస్‌ఐ రాయల సీమ డయాసిస్ పీఠాధిపతి డాక్టర్ ఐజక్ వరప్రసాద్, ఆయన కుమారుడి పాత్ర లేదన్నారు. అవాస్తవాలు చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టారని వివరించారు.