
టీడీపీనా... మజాకా!
● ప్రభుత్వ నిధులతో సోకులు
ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేయాల్సిన పనులన్నీ అధికారులు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధులతో మహానాడుకు సోకులు చేయడం లాంటివి గతంలో ఎక్కడా జరగలేదని పలువురు అంటున్నారు. ప్రొటోకాల్ పేరుతో రాత్రింబవళ్లు తమను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారని, తమకు అప్పగించిన పనులకు అయ్యే ఖర్చులు ఎవరు ఇస్తారంటూ అధికారులు వాపోతున్నారు. మహానాడు పనుల్లో అధికారులు నిమగ్నం కావడం వల్ల.. వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
● ప్రభుత్వ కార్యక్రమాన్ని తలపిస్తున్న మహానాడు
● ప్రొటోకాల్ పేరిట అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
● క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వారు పనుల్లో నిమగ్నం
● అధికారులు అందుబాటులో లేకప్రజలు అవస్థలు
కడప సెవెన్‌రోడ్స్: తొలిసారిగా కడప నగరంలో ఈ నెల 27 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. ఇది పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఇందుకు అవసరమైన ఏర్పా ట్లన్నీ ఆ పార్టీ నాయకత్వం చూసుకోవాలి. కానీ అధి కారుల హడావుడి, ఏర్పాట్లను పరిశీలిస్తే.. ఇదేమైనా ప్రభుత్వ కార్యక్రమమా అనే సందేహం ఎవరికై నా కలుగుతుంది. ప్రొటోకాల్ పేరుతో జిల్లా అధికార యంత్రాంగం గత 15 రోజులుగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎవరు ఏ పనులు చేయాలో సూచిస్తూ కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో అధికారులంతా తమకు అప్పగించిన పనులు పరిపూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు.. ఎవరూ తమ కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొటోకాల్ అనే ఒకే ఒక పదంతో అధికార పార్టీ రాజకీయ సభ ఏర్పాట్లను అధికారులు భుజానికెత్తుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులకు బాధ్యతలు అప్పగింత
ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే సందర్భాల్లో ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుంది. వీవీఐపీలు ఏదైనా ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తే.. ప్రొటోకాల్ నిబంధనలను అనుసరించి తగిన సెక్యూరిటీతోపాటు కొన్ని సాధారణ ఏర్పాట్లు మాత్రమే చేయాలి. ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు పూర్తిగా రాజకీయ కార్యక్రమం. ఇందులో పాల్గొనేందుకు వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులకు సాధారణ, పరిమిత ఏర్పాట్లు మాత్రమే చూడాలి. కానీ అందుకు భిన్నంగా అన్నీ తామై అధికారులు ఏర్పాట్లు చేస్తుండటం విస్మయ పరుస్తోంది. వీఐపీలు ఎయిర్‌పోర్టులో దిగింది మొదలు.. మహానాడు ముగిసి వెళ్లేపోయే వరకు దాదాపు ఏర్పాట్లన్నీ అధికారులే చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ.. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి వెళ్లే వరకు..
కడప ఎయిర్‌పోర్టులో దిగే వీఐపీలకు సంబంధించి ప్రొటోకాల్ ఏర్పాట్లు జమ్మలమడుగు ఆర్డీఓ, కడప మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. విమాన సిబ్బంది, ఇతరుల ఏర్పాట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చూడాలి. సెక్యూరిటీ ఇన్‌చార్జిగా కడప డీఎస్పీ, వైద్య సదుపాయాల ఏర్పాటు బాధ్యత జీజీహెచ్ సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అప్పగించారు. స్టేట్ గెస్ట్‌హౌస్, ఆర్‌అండ్‌బీ, హరిత హోటల్ ఓవరాల్ ఇన్‌చార్జి బాధ్యతలు పులివెందుల ఆర్డీఓకు అప్పగించారు. మళ్లీ ఒక్కో గెస్ట్‌హౌస్‌కు ఒక్కో డివిజన్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఇవి కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు సూపర్‌వైజింగ్, ఇన్‌చార్జి, సపోర్టింగ్ అధికారులకు జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్, ఆర్‌డీఓ, ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రటరీ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. మహానాడుకు వచ్చే 23 మంది మంత్రులకు 23 మంది లైజన్ అధికారులను ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటన ముగిసే వరకు ఇన్నోవా క్రిస్టా (ఏసీ) కార్లు, బస, ఆహారం వంటివి ఆయా అధికారులు చూడాలి. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వాహనాలను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన ఇంధనాన్ని కడప తహసీల్దార్ సమకూర్చాలి. నగరంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి ముఖ్యమంత్రి తదితరులు పూలమాలలు సమర్పించే ఏర్పాట్లను నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అప్పగించారు. బారికేడింగ్ ఏర్పాటు బాధ్యతను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి అప్పగించారు. వీఐపీలు పర్యటించే మార్గాల్లో పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులు కడప మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి చూడాలి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మీడియాకు రెఫ్రెష్‌మెంట్స్ బాధ్యత సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు అప్పగించారు.
మహానాడు నిర్వహించే ప్రాంగణంలో కూడా చాలా మేరకు బాధ్యతలను అధికారులకు అప్పగించారు. సభా వేదిక ఇన్‌చార్జి, ఆఫీసు సెటప్, మీటింగ్ రూము ఏర్పాట్లు కడప ఆర్డీఓ, కమలాపురం తహసీల్దార్ చూడాల్సి ఉంటుంది. బ్యారికేడింగ్, స్టేజ్ ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి అప్పగించారు. గ్రీన్ రూము ఏర్పాటు బాధ్యత బద్వేలు ఆర్డీఓ, పోరుమామిళ్ల తహసీల్దార్ చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందికి అవసరమైన భోజనాలు, ఇతర ఏర్పాట్లు సీకే దిన్నె తహసీల్దార్‌కు అప్పగించారు. విధి నిర్వహణలోని అధికారులు, సిబ్బంది భోజనాల బాధ్యతను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, డీఎస్‌ఓలకు అప్పగించారు. తాగునీటి సరఫరా బాధ్యతను కడప మున్సిపల్ కమిషనర్, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈ నిర్వహించాల్సి ఉంటుంది. మహానాడు గ్యాలరీ ఇన్‌చార్జిలుగా వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, వీఆర్వోలు, జూనియర్ ఇంజనీర్లు, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, వీఓఏలు, టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించారు. పరికరాలతో సహా వీడియో కాన్ఫరెన్స్ సెటప్ జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి (ఎన్‌ఐసీ)కి అప్పగించారు. ఇంటర్నెట్, లాంగ్ కనెక్షన్ వంటి పనులు బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీ ఫైబర్ నెట్ అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

టీడీపీనా... మజాకా!

టీడీపీనా... మజాకా!