
సీఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డికి డీఐఈఓగా ఉద్యోగోన్నతి
పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్‌చార్జిగా పని చేస్తున్న సీఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డిని ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా డీఐఈఓగా ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేసింది. ఆయన పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఏలూరు నుంచి బి.ప్రభాకర్‌ను ప్రభుత్వం ఎఫ్‌ఏసీగా నియమించింది.
మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా డీఎస్సీకి ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కడప బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన జిల్లా వాసులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్ అభ్యర్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఉచిత శిక్షణకు టెట్ పరీక్షలకు సంబంధించిన మార్కుల జాబితా, నేటివిటీ, కుల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు జతచేసి కడపలోని పాత రిమ్స్‌లోగల బీసీ భవన్ రెండవ అంతస్తులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 98499 19221, 99664 18572 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
12న ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన పది, ఇంటర్మీడియట్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన దూదేకుల విద్యార్థులకు ఈ నెల 12న నగరంలోని ఐఎంఏ హాల్‌లో ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్ల్లు ఏపీ నూర్ బాషా దూదేకుల, బీసీ, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గుటూరి చిన్న రాజా పేర్కొన్నారు. శనివారం నగరంలోని దూదేకుల సంక్షేమ భవన్‌లో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంఘంతో పాటు కడప నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌లో 950 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఆలాగే పదవ తరగతిలో 560 మార్కులు పైగా సాధించి దరఖాస్తు చేసుకున్న వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 94406 77839, 9441276127 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడుసుంకేసుల బాషా, నాయకులు ఖాదరయ్య, ఓబులేసు, కమాల్ బాషా పాల్గొన్నారు.
12న ధర్నా
కడప ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతోపాటు ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండానే రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడును కలిసి ధర్నాకు సంబంధించిన నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ 117 రద్దు చేయాలన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో 5 తరగతులు బోధించడానికి 5 మంది టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే 12న డీఈఓ కార్యా లయం ఎదుట ధర్నా చేపడతామని తెలిపారు.