రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

May 10 2025 8:08 AM | Updated on May 10 2025 8:26 AM

– మరొకరికి గాయాలు

చక్రాయపేట : మండలంలోని మారెళ్ళ మడక సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మూలి రామిరెడ్డి (55 )అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏఎస్‌ఐ రాజశేఖరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మారెళ్ల మడక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చక్రాయపేట మండలం కుప్పం గ్రామం బురుజుపల్లెకు చెందిన మూలి రామిరెడ్డి మృతి చెందగా, వేముల మండలం చాగలేరు గ్రామానికి చెందిన దిద్దికుంట కొండారెడ్డి గాయపడ్డారు. రామిరెడ్డి, కొండారెడ్డి కలిసి వేంపల్లెలోని ఓ వివాహానికి హాజరై బురుజుపల్లెకు వెళుతుండగా.. మారెళ్లమడక సమీపంలో మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో వెనక కూర్చొన్న రామిరెడ్డి పొలానికి వేసిన ఫెన్సింగ్‌ స్తంభానికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ కొండారెడ్డిని ప్రథమ చికిత్స నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు కడపకు తీసుకెళ్లారు. రామిరెడ్డి మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం చేయించి పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లి..

– కదిరి మండల వాసి కామసముద్రంలో మృతి

లింగాల : అనంతపురం జిల్లా కదిరి మండలం చెలంకూరుపల్లె గ్రామానికి చెందిన బెల్లం హైదర్‌వల్లి (58) అనే వ్యక్తి వైఎస్‌ఆర్‌ జిల్లా లింగాల మండలం కామసముద్రం గ్రామంలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం చెలంకూరుపల్లెకు చెందిన హైదర్‌వలి అనే వ్యక్తి బేల్దారి పనుల కోసం లింగాల మండలం కామసముద్రం గ్రామానికి వచ్చారు. ఆయన కామసముద్రం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువు గట్టు మీద నుంచి చెరువులోకి పడిపోయాడు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు హైదర్‌వలికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. హైదర్‌వల్లి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

– ఫాతిమా మెడికల్‌ కళాశాల నిర్లక్ష్యమేనని

పలువురు ఆరోపణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగర శివార్లలోగల ఫాతిమా మెడికల్‌ కళాశాలలో భవన నిర్మాణ కార్మికుడిగా, కళాశాలలో కూలీ పనులు చేసే ఓబులేశు అనే వ్యక్తి విద్యుత్‌ షాక్‌ తో మృతి చెందాడు. ఆయన శుక్రవారం కళాశాల కార్యాలయ గది రెండవ అంతస్తు నిర్మాణంపై ఉన్న లిఫ్ట్‌నకు కరెంటు రావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వారం రోజులుగా లిఫ్ట్‌నకు విద్యుత్‌ షాక్‌ కొడుతోందని కూలీలు యాజమాన్యానికి తెలియజేసినా పట్టించుకోలేదని.. ఓబులేసు లిఫ్ట్‌ చైన్‌ వైరు తాకడంతో షాక్‌కు గురై మృతి చెందాడని పలువురు తెలియజేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దళితుడైన ఓబులేసు మరణానికి కారణమైన ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డీహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి మునెయ్య డిమాండ్‌ చేశారు.

ప్రొద్దుటూరులో పేలిన ఐపీ బాంబు!

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో మరో ఐపీ బాంబు పేలింది. ప్రముఖ ఆయిల్‌మిల్లు వ్యాపారి రూ.2.70 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. మహాత్మాగాంధీ ఆటోనగర్‌ ఎదురుగా ఉన్న ఓ ఆయిల్‌మిల్లు యజమాని పెద్ద మొత్తంలో బాకీలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతను పట్టణంలోని కొంత మంది వ్యక్తులతోపాటు పలు బ్యాంకుల్లో కూడా అప్పులు తీసుకున్నాడు. రెండు రోజుల నుంచి ఆయిల్‌ మిల్లు మూసి ఉండటంతో పాటు ఇంటి వద్ద కూడా అతను కనిపించలేదు. పైగా ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో రుణదాతలు ఆందోళన చెందసాగారు. వ్యాపారంలో ఒడిదుడుకుల వల్ల అతనికి నష్టాలు వచ్చినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరులోని కోర్టులో వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రేపో, మాపో రుణదాతలకు నోటీసులు కూడా అందనున్నాయి.

గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం

ప్రొద్దుటూరు క్రైం : వంట గ్యా్‌స్‌ లీక్‌ కావడంతో దొరసానిపల్లెలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పోసా పుల్లయ్య ఇంట్లో గ్యాస్‌ లీక్‌ కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో వాషింగ్‌ మిషన్‌, ఉడ్‌ మంచాలు, టీవీ, ఉడేన్‌ కబోర్డులు, ఇతర సామగ్రి మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ తెలిపారు.

గంజాయి స్వాధీనం

ఖాజీపేట : ఖాజీపేట మండలంలో శుక్రవారం గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ మోహన్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నముక్కపల్లె గ్రామం తూర్పు వైపున దాడులు నిర్వహించామని అన్నారు. అక్కడ గంజాయి, పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 2.570 కేజీల గంజాయితోపాటు రూ 20,500 నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి దుర్మరణం 1
1/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి దుర్మరణం 2
2/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement