
మృత్యుశకటమైన ఆర్టీసీ బస్సు
బద్వేలు అర్బన్ : స్వగ్రామం నుంచి పట్టణానికి ఓ పని నిమిత్తం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆ వ్యక్తికి తాను ప్రయాణించిన బస్సే తన పాలిట మృత్యుశకటమవుతుందని ఊహించలేదు. గురువారం బద్వేలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం గానుగపెంట గ్రామానికి చెందిన గంధంశెట్టి నరసింహులు (69) ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ఈయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నరసింహులు ఓ పని నిమిత్తం గురువారం ఉదయం బద్వేలు – చల్లగిరిగెల – క్రిష్ణంపల్లె ఆర్టీసీ బస్సులో బద్వేలు బస్టాండులో దిగారు. బస్టాండు నుంచి పోస్టాఫీసు వద్దకు వెళ్లేందుకు నడుచుకుంటూ వస్తుండగా డిపో నుంచి తిరిగి బయలుదేరిన బస్సు బస్టాండు సమీపంలోని సిద్దవటం రోడ్డులో నరసింహులును ఢీకొట్టింది. దీంతో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ సురేంద్ర కేసు నమోదు చేశారు.