
ఖాకీలకు చెంపపెట్టు !
సాక్షి ప్రతినిధి, కడప : ‘ప్రజల మాన, ప్రాణ, ఆస్తులు కాపాడేందుకు రక్తాన్నైనా చిందిస్తాం’. ఇది ఒకప్పుడు పోలీసుల అంకితభావం. అందుకు చిహ్నంగా పోలీసు స్టేషన్ గోడలకు ఎర్ర రంగు వేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అక్రమార్జన కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. పోస్టింగ్‌్ కోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వెరసి చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారుతోంది. మెప్పు కోసం, రాజకీయ నేతల ప్రాపకం కోసం పోలీసు అధికారులు వేస్తున్న తప్పటడుగులు న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు తాజాగా వారినే బోనులో నిలబెట్టే స్థితికి చేరుకుంది. అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి రెండు రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసుల మెడపై ఇప్పుడు హైకోర్టు కత్తి వేలాడుతోంది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడంటూ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు ఆధారాలతో సహా బహిర్గతం కావడంతో ఇప్పుడు పోలీసులు బోనులో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి గత ఏడాది నవంబర్ 8వ తేదీన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 11వ తేదీ అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇదే అంశాన్ని వర్రా రవీంద్రారెడ్డి మెజిస్ట్రేట్ ముందు చెప్పడంతో పాటు తనను కర్నూలు డీటీసీలో రెండు రోజులు ఉంచి చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ రికార్డు చేయించుకున్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద 8వ తేదీన పోలీసుల అదుపులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావడంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీరియస్ అయింది.
మొదటి నుంచి అత్యుత్సాహం..
సోషల్ మీడియా కేసులో వర్రా రవీంద్రారెడ్డిపై పోలీసులు మొదటి నుంచి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ వర్రా రవీంద్రారెడ్డిని కడప తాలూకా స్టేషన్ వద్ద అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక శ్రద్ధతో ఉన్న ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వం ఓ ఎస్పీనే బదిలీ చేసి, మరో సీఐపై చర్యలు తీసుకుంది. ఆ తర్వాత నవంబర్ 8వ తేదీన వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కర్నూలు డీటీసీకి తీసుకెళ్లారని ఆరోపణ. అక్కడ అతన్ని చిత్రహింసలకు గురిచేశారని అతనితో పాటు ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులకు చెప్పారు. వర్రా రవీంద్రారెడ్డి సతీమణి కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆపై అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా, వర్రా రవీంద్ర కూడా ఇదే అంశాన్ని మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. ఆధారాలు కూడా సేకరించి హైకోర్టు ముందుంచాడు. విచారణ చేపట్టిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తప్పుడు అఫిడవిట్లు సమర్పించడంపై సీరియస్ అయింది. విచారణ అనంతరం పోలీసుల అధికారులపై కోర్టు తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు చెప్పారంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆ అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పేట్లు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వర్రా రవీంద్రారెడ్డి కేసులో
పోలీసులకు హైకోర్టు అక్షింతలు
అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసులు అత్యుత్సాహం
నవంబర్ 8న అదుపులోకి తీసుకుని 11వ తేది అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు
హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన
వర్రా రవీంద్రారెడ్డి సతీమణి
కేసు విచారణలో అధికారుల తీరుపై మండిపడ్డ న్యాయమూర్తి