
పిడుగులతో జాగ్రత్త.!
రాజంపేట టౌన్ : ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏ రకమైన వానలు కురుస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే వాటితోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం సహజంగా జరుగుతుంది. పిడుగుకు బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. అందువల్ల పిడుగులు పడిన ప్రతిసారి మనుషులతో పాటు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పిడుగుపాటుకు సమిధలవుతున్నారు. పిడుగుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం దగ్ధమవుతున్నాయి. పిడుగు పడే ప్రాంతాలపై విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రాణనష్టం జరుగుతుండటం బాధాకరం. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేసుకోవాలి..
పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తయిన ప్రదేశాల నుంచి నేరుగా భూమిలోకి లైట్నింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ఏర్పాటు చేసుకోవడం వల్ల పిడుగులో ఉన్న విద్యుతావేశం భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఎత్తయిన భవనాలు, ఇతర నిర్మాణాలు నిర్మించుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
మిలియన్ మెగావాట్ల శక్తి..
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు బయటకు వెళ్లక పోవడమే ఉత్తమం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోకి వెళ్లకూడదు. మెరుపు లేదా పిడుగు కాంతిని చూసేందుకు కూడా ప్రయత్నించకూడదు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.
సమయస్ఫూర్తి అవసరం..
వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి రైతులు అప్రమత్తం కావాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒకవేళ సురక్షిత ప్రాంతానికి వెళ్లే సమయం లేకుంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. అందువల్ల సమీపంలో పిడుగు పడినా అందులో విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బరు చెప్పులు వేసుకోవడం మంచిది. అలా కుదరని పరిస్థితిలో కాళ్లను భూమి మీద పూర్తిగా ఆనించకుండా, కాలివేళ్లపై ఉండేందుకు ప్రయత్నించాలి.
మే, జూన్ నెలల్లో అప్రమత్తంగా ఉండాలి..
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే, జూన్ నెలల్లో ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు క్యూములో నింబస్ మేఘాల కారణంగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షం కురిసే అవకాశం ఉందని ముందే తెలిసినప్పుడు వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లకపోవడం మంచిది.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
● సాధారణంగా ఎత్తుగా ఉండే నిర్మాణాలు, ప్రాంతాలపై పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. అందువల్ల వర్షం కురిసే సమయంలో ఎత్తయిన చెట్లు, సెల్‌టవర్, విద్యుత్ స్థంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు.
● టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విదుత్ కుక్కర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు కంప్యూటర్లు ఇతర విద్యుత్ పరికరాలు ఉపయోగించకూడదు
● వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
● గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలి.
● ముఖ్యంగా పొలాల్లో పనిచేయడం, పశువులు మేపడం వంటివి చేయకూడదు.
● చెరువు, ఈతకొలనులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.
ప్రథమ చికిత్స ఇలా చేయాలి..
● పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి.
● తడి దుస్తులు తొలగించి పొడి దుస్తులు వేయాలి.
● మెల్లగా పడుకోబెట్టి రెండుకాళ్లు పైకి ఎత్తి ఉంచాలి.
● తల ఒకవైపునకు తిప్పి పెట్టాలి.
● నోటి ద్వారా నీరు, ఇతర ఎలాంటి ఆహారాన్ని అందించకూడదు.
● వెంటనే అందుబాటులో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలి.
రాష్ట్రంలో రెండు రోజుల క్రితం
పిడుగులు పడి ఆరుగురి మృతి
అప్రమత్తత అవసరమంటున్న
వాతావరణ శాఖ