టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్‌

Mar 14 2025 12:05 AM | Updated on Mar 14 2025 12:05 AM

టెలీ

టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్‌

కడప టాస్క్‌ఫోర్స్‌: ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏపీఎస్‌పీడీసీఎల్‌)లో నిర్వహిస్తున్న వరుస టెలీ కాన్ఫరెన్సులతో అటు ప్రజలు, ఇటు విద్యుత్‌ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ శాఖ అనేది అత్యవసరాల్లో పనిచేసే ప్రభుత్వ శాఖల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఇతర శాఖల సిబ్బందికై నా కొన్ని నిముషాలు, గంటల వ్యవధి ఉంటుంది. కానీ విద్యుత్‌ శాఖలో మాత్రం సెకన్లు, నిముషాల్లో స్పందించకపోతే భారీ నష్టం చవి చూడక తప్పదు. ప్రతి మంగళవారం, శనివారం జిల్లా విద్యుత్‌ శాఖ పర్యవేక్షక ఇంజినీరు స్వయంగా ఈ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వస్తుంటారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రెండు, మూడు గంటలపాటు టెలీ కాన్ఫరెన్స్‌ ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్‌ పరంగా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా....ఉదాహరణకు విద్యుత్‌ లైన్లు తెగిపడినా, లైన్లు తగులుకొని ఎవరైనా జంతువుగానీ, మనిషిగానీ చనిపోయినా...ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, మంటలు రేగినా ఇతరత్రా ఏ సమస్య వచ్చినా విద్యుత్‌ సిబ్బందికి చెబుదామంటే వారి ఫోన్లు పనిచేయవు. వారి ఉన్నతాధికారులకు చెప్పాలనుకుంటే అదీ కుదరదు. ఎందుకంటే వారంతా విద్యుత్‌ శాఖ సిబ్బంది మొత్తం టెలీ కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉంటారు. ఇది ఒకరోజుతో పోయేది కాదు...వారానికి రెండు సార్లు, రెండు, మూడు గంటలపాటు కొనసాగుతూనే ఉంటుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డీఈఈలు, ఏఈలు, ఏఓలు, జేఏఓలు, లైన్‌మెన్లు, ఏఎల్‌ఎంలు, జేఎల్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు, సబ్‌ స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు, వాచ్‌మెన్లు అందరూ ఎక్కడ ఎన్నా...ఏ పరిస్థితుల్లో ఉన్నా టెలీ కాన్ఫరెన్సుకు హాజరై తీరాల్సిందే. లేకుంటే వారికి వెంటనే మెమోలు జారీ అవుతాయి. ప్రతిరోజూ ఉదయం విద్యుత్‌ సిబ్బంది డిస్‌కనెక్షన్‌ లిస్టు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి కరెంటు బిల్లులు చెల్లించని వారి విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తుంటారు...ఒకవేళ వారు వెంటనే బిల్లులు చెల్లిస్తే సాయంత్రంలోపు విద్యుత్‌ కనెక్షన్లు పునరుద్ధరించాల్సి ఉంటుంది. మిగతా అన్ని రోజులూ ఇబ్బంది లేదుగానీ ఆ రెండురోజుల్లో మాత్రం సమస్యలెదురవుతున్నాయి.

సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించడం వల్ల అప్పటికే చీకటి పడిపోతోంది. ఆ సమయంలో సిబ్బంది స్తంభాలు ఎక్కి పనిచేయడం కష్టతరమవుతోంది. విద్యుత్‌ సిబ్బంది పనిచేయకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరి చేత విద్యుత్‌ కనెక్షన్‌ పునరుద్ధరించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు కరెంటు పోయినా, లైన్లు తెగినా, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా ఆ సమయంలో ప్రజల గోడు వినే నాథుడే ఉండటం లేదు. సాధారణంగా ఎస్‌ఈ స్థాయిలోని అఽధికారి ఈఈలు, డీఈలు, ఏఈలు, ఏఓలు వంటి అధికారులతోనే టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించడం ఆనవాయితీ. ప్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌కు స్పందించాల్సిన చిన్న స్థాయి ఉద్యోగులను కూడా టెలీ కాన్ఫరెన్స్‌లోకి తీసుకోవడంతో వారు ఆ సాకు చెప్పి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న సబ్‌స్టేషన్లలో సుమారు 1000 మంది పనిచేస్తున్నారు. ఇందులోని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందితో ఒకేసారి టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి చిన్న స్థాయి ఉద్యోగులందరికీ తెలిసేలా వారిపై అధికారులను తిడుతుండటం వల్ల వారు మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. తాము ఏదైనా తప్పు చేసినా, సరిగా పనిచేయకపోయినా ఉన్నతాధికారి పిలిచి మందలించవచ్చు. ఇలా టెలీ కాన్ఫరెన్స్‌లో అందరి సమక్షంలో తిట్టడం వల్ల వారు అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. ఏఈలు చెప్పినట్లు లైన్‌మెన్లు, ఆపరేటర్లు, వాచ్‌మెన్లు పనిచేస్తారు కాబట్టి ఏఈలతో కాన్పరెన్స్‌ నిర్వహిస్తే సరిపోతుంది. అలా కాకుండా ప్రజలకు, విద్యుత్‌ సంస్థకు వారధిగా ఉండి ప్రజలకు కావాల్సిన పనులు చేసిపెట్టే క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించడం వల్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెప్పేవారికి వినేవారు లోకువ అన్న చందంగా వారానికి రెండు సార్లు చెప్పిందే గంటలు, గంటలు చెప్పడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

చీకటిలో పని చేయలేక...

ప్రభుత్వం ఏదైనా ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించినప్పుడో లేదా విద్యుత్‌ సంస్థ ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించినప్పుడో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లు అనుసరించడంలో అర్థముంది. జిల్లాలో అలా జరగడం లేదు. వారానికి రెండు సార్లు జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితో రెండు, మూడు గంటలపాటు అదేపనిగా టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌ కోసం సిబ్బంది ఫోన్లు పని చేయక జనం ఇబ్బంది పడుతున్నారు.

విద్యుత్‌ శాఖలో వారానికి రెండుసార్లు కొన్ని గంటలపాటు స్తంభించిపోతున్న కార్యకలాపాలు

ఆ సమయంలో పనిచేయని విద్యుత్‌ సిబ్బంది ఫోన్లు

ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌కు స్పందించని క్షేత్రస్థాయి సిబ్బంది

ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం

టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్‌ 1
1/1

టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement