
రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ అధికారి విచారణ
కడప అర్బన్ : కడప నగరంలో ఈనెల 27వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రవాణాశాఖ అధికారి శ్వేత గురువారం విచారణ చేపట్టారు. ఏడు రోడ్లవద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయగా బస్సు కండీషన్‌పై గురువారం ఉదయం రవాణా శాఖాధికారి శ్వేత దర్యాప్తు చేశారు. ఏడు రోడ్ల వద్ద ప్రతిరోజు రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పదుల సంఖ్యలో నిలబెడుతూ వుండటంతో ట్రాఫిక్ అధికం అవుతోందని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులకు చెప్పినా అక్కడే గంటల కొద్దీ బస్సులు నిలుపుతూ ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయని చెబుతున్నారు. బస్సుల యజమానులకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని ట్రాఫిక్ సీఐ జావేద్ తెలిపారు.