
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
కమలాపురం : ప్రతి ఒక్క వాహన డ్రైవర్ భద్రతా నియమాలు పాటించాలని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. గురువారం 54వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సమావేశాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని నల్లింగాయపల్లెలోని బీసీసీపీఎల్‌లో ఆయన వాహన డైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ముందుగా భద్రతా పతాకాన్ని ఎగుర వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలు పాటించినపుడే గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవచ్చన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకపోతే అటు యజమానులు, ఇటు డ్రైవర్ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండవచ్చన్నారు. రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు ముంచుకొస్తాయన్నారు. డ్రైవర్లు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడతారని, తద్వారా కుటుంబ సభ్యులు వీధిన పడతారని గుర్తు చేశారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. క్రిష్ణమూర్తి మాట్లాడుతూ భద్రత కంటే ఆరోగ్యం ముఖ్యం అన్నారు. ఈ సంవత్సరం థీమ్ వివరిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలంటే మనమందరం ఆరోగ్య సూత్రాలను, భద్రతా చర్యలను పాటించాలన్నారు. భద్రతా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పీపీఈ స్టాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం జగదీశ్వర్ రెడ్డి, హెచ్‌ఆర్ హెడ్ గోపాల్‌రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ జి.మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీసీపీఎల్ సీఎంఓ సాయిరమేష్