మండల పరిషత్ పాలకవర్గాలు లేవు.. మండల సభలూ లేవు
పెద్దవూర : గ్రామ సమస్యలను అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయడానికి సర్పంచులకు సరైన వేదిక దొరకడం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. అందులో సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారులకు వివరించేవారు. గత రెండేళ్లుగా మండల పరిషత్ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం మండల సభలు జరగడం లేదు. దీంతో గ్రామ సమస్యలు ఎవరికి చెప్పాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలకు ఒకసారి మండల సభలు
గతంలో ఎంపీపీ అధ్యక్షతన ప్రతీ మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ నుంచి మండల స్థాయి అధికారులకు తమ శాఖలకు సంబంధించిన మూడు నెలల ప్రగతి నివేదికలతో వచ్చేవారు. శాఖల వారీగా అధికారులు తమ నివేదికలను చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. సమస్యలకు పరిష్కారాలను అధికారులు వివరించేవారు.
గ్రామాల సమస్యలు ఎలా..?
గడువు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాలలో సమస్యలు పేరుకుపోయాయి. కానీ ఇప్పటికీ మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో.. ఎలా చెప్పుకోవాలో తెలియక సర్పంచులు సతమతమవుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సైతం కొంత ప్రత్యేక నిధులు కేటాయించేవారు. వీటితో గ్రామాలలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేవి. కనీసం మండల అధికారులకు, తమకు మధ్య పరిచయం కోసమైనా సభలు నిర్వహించాలని సర్పంచులు కోరుతున్నారు.
గతంలో మూడు నెలలకు ఒకసారి మండల సభలు
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లేదని సర్పంచుల ఆవేదన


