చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

భువనగిరి(బీబీనగర్‌) : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు పుస్తెలతాడు అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న బీబీనగర్‌కు చెందిన కుక్కడపు అండాలు, ఆమె భర్త ఇంట్లో ఉండగా.. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన గంగాధరప్ప, కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌ జిల్లాకు చెందిన జంగాల శివరాజ్‌ బైక్‌పై వారి వద్దకు వచ్చారు. తాము ప్రభుత్వ ప్రతినిధులమని పరిచయం చేసుకుని.. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకానికి సంబంధించి ఫొటో తీయాలని నమ్మించారు. ఫొటో తీయాలంటే మెడలో ఉన్న మంగళసూత్రం తీయాలని అండాలుకు సూచించారు. దీంతో ఆమె తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి పక్కనే ఉన్న భర్తకు ఇచ్చింది. ఇద్దరు నిందితులు ఫొటో తీస్తున్నట్లు చేసి అండాలు భర్త చేతిలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బీబీనగర్‌ పోలీసులు ఆదివారం నిందితులను పట్టుకుని వారి నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement