మిర్యాలగూడ అర్బన్: మహిళ మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శనివారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, నారాయణపూర్ గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా (అలియాస్ బిల్లా) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి బెంగుళూరులో వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు నరసారావుపేటకు చెందిన చంటితో స్నేహం చేశాడు. అతని ద్వారా పరిచయమైన మరో వ్యక్తితో కలిసి విజయవాడలో చంటి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశాడు. అంతేకాకుండా గతంలో నాగుల్‌మీరా దాచేపల్లిలో మరో మర్డర్ చేశాడు. ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎనిమిది చైన్‌స్నాచింగ్ కేసులు, రెండు రాబరీ కేసులు నమోదై పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మొత్తం 12కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగుల్‌మీరాపై దాచేపల్లిలో రౌడీషీట్ సైతం ఉంది. ఈ నెల 12న ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు తన ఇంటి ముందు నిలబడి ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన నాగుల్‌మీరా ఆమెను మాటల్లో పెట్టి మెడలో ఉన్న సుమారు 9తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో శనివారం మిర్యాలగూడలోని ఫ్లైఓవర్ వద్ద స్కూటీపై తచ్చాడుతున్న అతడిని చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.10లక్షల విలువైన 7.5 తులాల బంగారు ఆభరణాలు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్పీ రవి, వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు, ఎస్‌ఐలు ప్రవీణ్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఫ నిందితుడిపై రెండు హత్య కేసులతోపాటు, 8 చైన్‌స్నాచింగ్ కేసులు
ఫ రిమాండ్‌కు తరలించిన పోలీసులు


